AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ కమెడియన్‏.. చివరకు బస్టాండ్‌లో అనాథలా.. పరామర్శించిన ఒకే ఒక్క హీరో..

హాస్యనటిగా వెండితెరను ఏలిన దాసరి గిరిజ జీవితం విషాదమయం. రేలంగితో కలిసి అద్భుతమైన హాస్యాన్ని పండించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కెరీర్ పతనం, భర్త మోసం, ఆర్థిక ఇబ్బందులు ఆమెను అమావాస్య చీకట్లలోకి నెట్టాయి. చివరి రోజుల్లో అత్యంత దయనీయ స్థితిలో గడిపి, 1995లో కన్నుమూశారు.

Tollywood : ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ కమెడియన్‏.. చివరకు బస్టాండ్‌లో అనాథలా.. పరామర్శించిన ఒకే ఒక్క హీరో..
Dasari Girija
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2026 | 3:31 PM

Share

తెలుగు సినిమా స్వర్ణయుగంలో హాస్యనటిగా ఓ వెలుగు వెలిగి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి దాసరి గిరిజ జీవితం అడుగడుగునా కష్టాలు, విషాదాలతో నిండి ఉంది. వెండితెరపై నవ్వులు పూయించిన ఆమె, నిజ జీవితంలో మాత్రం అంతులేని కన్నీళ్లను దిగమింగుకుంటూ ఒంటరిగా కన్నుమూయడం సినీ చరిత్రలో ఒక విషాద ఘట్టం. గిరిజ తల్లి దాసరి తిలకం కూడా నటీమణి. 1940లో చండికా సినిమాలో తిలకం నటించే నాటికి గిరిజ పుట్టి ఏడాది మాత్రమే అయ్యింది. కృష్ణాజిల్లా గుడివాడలో అమ్మమ్మ గారింట్లో పెరిగిన గిరిజకు, సినిమాలంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. బాగా చదువుకుని శభాష్ అనిపించుకోవాలనే లక్ష్యంతో ఉండేవారు. అయితే, తల్లితో కలిసి మద్రాసు వెళ్లినప్పుడు సినీ వాతావరణం ఆమెను ఆకర్షించింది. 13 ఏళ్ల వయసులో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా, కస్తూరి శివరావు దర్శకత్వంలో రూపొందిన పరమానందయ్య శిష్యులు సినిమాలో రాజకుమారి పాత్రతో గిరిజ తొలిసారిగా నటించారు. ఆ చిత్రం ఆడకపోయినా, అందులో రేలంగితో పరిచయం ఆమె సినీ జీవితానికి కీలక మలుపు తిప్పింది.

రేలంగి సిఫార్సుతో పాతాళభైరవిలో దేవత పాత్ర లభించడంతో, “నరుడా! ఏమని నీ కోరిక?” అనే డైలాగ్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్ర పరిశ్రమలో చాలామంది దృష్టిని గిరిజ ఆకర్షించారు. అదృష్ట దీపుడు, ధర్మదేవత వంటి చిత్రాలలో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. మద్రాసుకు వచ్చిన మూడేళ్లలోనే తమిళం నేర్చుకుని, ద్విభాషా చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. 1953లో కోడరికం, ప్రతిజ్ఞ, నా యిల్లు వంటి చిత్రాల్లో నటించారు. 1954లో వచ్చిన ద్విభాషా చిత్రం మనోహర ద్వారా గిరిజ ఉత్తరాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. అయితే, అంజలీదేవి, సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటి అగ్రతారల గ్లామర్ పోటీలో హాస్య పాత్రల వైపు మొగ్గు చూపారు.

ఇదే సమయంలో రేలంగి-గిరిజల జంట తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. 1950లు, 60ల ప్రథమార్థంలో ఈ జోడి బాక్సాఫీస్ వద్ద పరుగుల పంట పండించింది. వందలాది చిత్రాల్లో రేలంగితో కలిసి నటించిన గిరిజ, కాశీకి పోయాను రామా హరీ, సరదా సరదా సిగరెట్టు, ఓహోహో మావయ్యా ఇదేమయ్యా వంటి ఎన్నో పాటలతో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరి మధ్య మాటలకు అందని అనుబంధం ఉండేదని, రేలంగి గిరిజకు ఓ ఇల్లు కూడా కొనిచ్చారని చెప్పుకుంటారు. హాస్యనటిగానే కాకుండా, సహాయ నటిగా, కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా కూడా గిరిజ రాణించారు. కులగోత్రాలులో పద్మనాభంతో, ప్రేమించి చూడు చిత్రంలో చలం సరసన నటించారు. భార్యాభర్తలు చిత్రంలో వ్యాంప్ పాత్రతోనూ మెప్పించారు.

అయితే, 60వ దశకం చివరి నాటికి పద్మనాభం-గీతాంజలి, ఆ తర్వాత రాజబాబు-రమాప్రభ వంటి కొత్త హాస్య జంటలు రావడంతో గిరిజకు అవకాశాలు తగ్గాయి. గ్లామర్ తగ్గింది, వయసు పెరిగింది అనే విమర్శలు రావడంతో ఆమె క్యారెక్టర్ రోల్స్‌కు మారారు. సుమంగళి చిత్రంలో పద్మనాభంకు తల్లిగా నటించేందుకు వెనుకాడలేదు. అవకాశాలు పూర్తిగా తగ్గడంతో, ప్రొడక్షన్ మేనేజర్ సన్యాసిరావును 1967లో వివాహం చేసుకున్నారు గిరిజ. దురదృష్టవశాత్తు, భర్త విజయగిరి ధ్వజ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన భలే మాస్టర్ (1962), పవిత్ర హృదయాలు (1971) చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఈ చిత్రాలకు గిరిజే పెట్టుబడి పెట్టడంతో ఆమె ఆర్థికంగా చితికిపోయారు. వైవాహిక జీవితంలోనూ ఆమెకు కష్టాలే ఎదురయ్యాయి. భర్త తాగి వచ్చి కొట్టడం, కూతురిని పట్టించుకోకపోవడం, చివరకు గిరిజ డబ్బు అంతా ఖర్చు అయిపోయాక చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం వంటి ఘటనలు ఆమెను మరింత కుంగదీశాయి.

ఒకప్పుడు మద్రాసు తేనాంపేటలో లంకంత ఇంట్లో దర్జాగా బ్రతికిన గిరిజ, చివరి రోజుల్లో ఉన్న ఆస్తులు అన్నీ అమ్మి అప్పులు తీర్చి, ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారారు. కనీస అవసరాల కోసం స్నేహితులు, బంధువులను యాచించాల్సిన పరిస్థితి వచ్చింది. తమ కుటుంబంలో మూడో తారగా కూతురు శ్రీగంగను సినిమా రంగంలోకి తీసుకురావాలని ఎంతో ఆశపడ్డారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన మేఘసందేశం చిత్రంలో అక్కినేని కూతురిగా శ్రీగంగ నటించినా, ఆమెకూ పెద్దగా గుర్తింపు రాలేదు. చివరికి శ్రీగంగ తన పేరును సలీమాగా మార్చుకుని, ఇంటీరియర్ డెకరేషన్‌లో డిప్లమా చేసి ప్రస్తుతం చెన్నైలో స్థిరపడ్డారు. హాస్యనటి దాసరి గిరిజ 1995 సెప్టెంబర్ 5న కన్నుమూశారు. ఆమె మరణం గురించి చాలామంది సినీ ప్రముఖులకు తెలియదు, ఎవరూ పరామర్శకు రాలేదు. ఆ రాత్రి శోభన్ బాబు మాత్రమే ఫోన్ చేసి శ్రీగంగను పరామర్శించారు. వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించిన గిరిజ, తన కష్టాలు, కన్నీళ్లను తనతోనే తీసుకుని మౌనంగా వెళ్లిపోయారు.

Follow Us