కర్నాటక రాష్ట్రానికీ నివర్ ముప్పు ! ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, బెంగుళూరులో భారీ వర్షాలు ?

తమిళనాడు, పుదుచ్ఛేరి, ఏపీలో కొన్ని ప్రాంతాలను కుదిపివేసిన నివర్ తుపాను ముప్పు కర్ణాటక రాష్ట్రానికీ పొంచి ఉంది. వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుపాను ఈ రాష్ట్రం వైపు నెమ్మదిగా వస్తూ....

  • Umakanth Rao
  • Publish Date - 12:48 pm, Fri, 27 November 20
కర్నాటక రాష్ట్రానికీ నివర్  ముప్పు ! ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, బెంగుళూరులో భారీ వర్షాలు ?

తమిళనాడు, పుదుచ్ఛేరి, ఏపీలో కొన్ని ప్రాంతాలను కుదిపివేసిన నివర్ తుపాను ముప్పు కర్ణాటక రాష్ట్రానికీ పొంచి ఉంది. వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుపాను ఈ రాష్ట్రం వైపు నెమ్మదిగా వస్తూ  ముఖ్యంగా దక్షిణ కర్ణాటక అంతర్ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో బెంగుళూరు సహా వివిధ చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చునని అంచనా వేస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బెంగుళూరు అర్బన్, కోలార్, చిక్ బళ్లాపూర్, తుమకూరు, మాండ్యా, రామనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్ర కోస్తా ప్రాంతాలకూ వాన గండం పొంచి ఉంది.

ఇలా ఉండగా నివర్ సైక్లోన్ ప్రభావం కారణంగా తమ కేంద్రపాలిత ప్రాంతానికి రూ. 400 కోట్ల నష్టం వఛ్చినట్టు అంచనా  వేస్తున్నామని పుదుచ్ఛేరి సీఎం వి.నారాయణస్వామి తెలిపారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే  అన్నారు.ఇక ఏపీలో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు కడప జిల్లాలకు ఇంకా నివర్ ముప్పు తగ్గలేదు. శుక్రవారం కూడా ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రాగాల 12 గంటల్లో ఇది అల్పపీడనంగా బలహీనపడవచ్చునని, దీని ప్రభావం వల్ల మళ్ళీ ఈ నెల 29 న తమిళనాడుకు నివర్ డేంజర్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.