గీత తల్లిదండ్రుల అన్వేషణలో కొత్త ట్విస్ట్.. మా కూతురే అంటూ మహబూబాబాద్, పెద్దపల్లి నుంచి రెంటు కుటుంబాల రాక..
ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయింది. జిల్లా కాదు.. రాష్ట్రం కాదు.. ఏకంగా దేశమే దాటిపోయింది. చివరికి తన స్వస్థలం ఆనవాళ్లు గుర్తుకు వచ్చి..
ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయింది. జిల్లా కాదు.. రాష్ట్రం కాదు.. ఏకంగా దేశమే దాటిపోయింది. చివరికి తన స్వస్థలం ఆనవాళ్లు గుర్తుకు వచ్చి.. వాటి ఆధారంగా కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చింది. పాకిస్తాన్‌లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గీత.. అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు భారత్‌కు వచ్చింది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు గీత తన తల్లిదండ్రుల కోసం దేశ వ్యాప్తంగా అన్వేషిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రానికి గీత వచ్చింది. స్వస్థలాన్ని గుర్తించే పనిలో ఉంది.
అయితే గీత తల్లిదండ్రుల అన్వేషణలో తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. గీత తమ బిడ్డే అంటూ కొందరు ముందుకు వచ్చారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన యాకయ్య, శాంత దంపతులు గీత తమ కూతురే అని అధికారులను ఆశ్రయించారు. కురవి మండలం నేరడ శివారు రాయినిపట్నానికి చెందిన వీరిద్దరూ.. 15 ఏళ్ల క్రితం పని కోసం హైదరాబాద్ వచ్చారు. కొంపల్లి దగ్గర పని చేస్తున్న సమయంలో వారి కూతురు తప్పిపోయింది. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడా చిన్నారి వేసుకున్న దుస్తులు, ఓ ఫోటో, ఆమెకున్న పుట్టుమచ్చలను చూపెడుతూ గీత తమ బిడ్డేనని పక్కాగా చెబుతున్నారు. చిన్నప్పుడు కూడా తమ కూతురు మూగ సైగలే చేసేదని, మాటలు రావని వారు అంటున్నారు. పుట్టుమచ్చలు, పోలికలు చూస్తే గీత తమ కూతురేగానే కనిపిస్తోందంటోంది శాంత. ఏకైక కుమార్తె తప్పిపోయాక తాము దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నామని యాకయ్య, శాంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన బొల్లిస్వామి దంపతులు కూడా గీత తమబిడ్డే అని అంటున్నారు. గీత పేరు సరిత అని వారు చెప్పుకొస్తున్నారు. 1993 పుట్టిన సరిత.. 2001లో ఇంటి నుంచి తప్పిపోయిందని వివరించారు. గీతలో తన కూతురు పోలికలు కనిపిస్తున్నాయని.. తమకు డీఎన్‌ఏ టెస్ట్ చేసి నిర్థారించాలని పెద్దపల్లి కలెక్టర్ భారతి హోలీకేరికి వినతిపత్రం అందజేశాడు. మరి ఈ ఇద్దరూ గీత తమ కూతురే అంటూ ముందుకు రావడంతో.. అధికారులు ఆ విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. ఇకనైనా గీత నిరీక్షణ ఫలించేనా.. ఆమె అన్వేషణకు తెరపడేనా అంటే కాలమే సమాధానం చెప్పాలి.
Also read:
టోల్‌గేట్ల వద్ద వెహికల్స్ ఆగాల్సిన అవసరం లేదట.. రెండేళ్లలో టోల్‌ఫ్రీ దేశంగా మారుతుందన్న గడ్కరీ