చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే స్నాక్ పాప్‌కార్న్. బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని డైట్‌లో చేర్చుకుంటారు. అయితే, పాప్‌కార్న్ ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా తింటే మాత్రం అంతేసంగతులు.
పాప్‌కార్న్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదే కానీ, ఒకేసారి అతిగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పట్టేయడం, ఉబ్బరం, తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది.
బయట కొనే పాప్‌కార్న్‌లో రుచి కోసం విపరీతంగా ఉప్పు, వెన్నను చేరుస్తారు. అధిక సోడియం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇందులోని ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి.
ముఖ్యంగా థియేటర్లలో లేదా ప్యాక్డ్ రూపంలో దొరికే పాప్‌కార్న్‌లో ఉప్పు, వెన్న, కృత్రిమ రుచులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు పెరగడానికి, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయి.
మైక్రోవేవ్ పాప్‌కార్న్ ప్యాకెట్లలో రుచి కోసం డయాసిటిల్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. ఈ ప్యాకెట్లను వేడి చేసినప్పుడు వచ్చే వాసనను పదే పదే పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
పాప్‌కార్న్ వల్ల లాభాలు పొందాలంటే, బయట దొరికే మసాలా లేదా కరామెల్ పాప్‌కార్న్ కంటే ఇంట్లోనే తక్కువ నూనె, తక్కువ ఉప్పుతో ఎయిర్-పాప్డ్ పద్ధతిలో తయారు చేసుకోవడం ఉత్తమం.
పాప్‌కార్న్ తినేటప్పుడు సరిగ్గా పగలని మొక్కజొన్న గింజలు పళ్ల సందుల్లో ఇరుక్కుపోయి చిగుళ్ల నొప్పులకు లేదా పళ్లు విరగడానికి కారణం కావచ్చు.
ఏదైనా సరే మితిమీరితే అమృతం కూడా విషమే. కాబట్టి పాప్‌కార్న్‌ను ఒక ఆరోగ్యకరమైన స్నాక్‌గా పరిమితంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.