విశాఖ తీరం మరో ‘వాడరేవు’గా మారే పరిస్థితి.. అధికారులు స్పందించకుంటే రణరంగం తప్పదంటున్న స్థానిక మత్స్యకారులు
విశాఖ తీరం మరో వాడరేవుగా మారే పరిస్థితి కన్పిస్తోంది. వారాలు గడుస్తున్నా ఇంకా ప్రకాశం జిల్లాలోని వాడరేవు - కఠారివారిపాలెం గ్రామాల మధ్య..
విశాఖ తీరం మరో వాడరేవుగా మారే పరిస్థితి కన్పిస్తోంది. వారాలు గడుస్తున్నా ఇంకా ప్రకాశం జిల్లాలోని వాడరేవు – కఠారివారిపాలెం గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగలేదు. ఇప్పుడు ఇలాంటి వివాదమే విశాఖ సాగరతీరంలో మంట పుట్టిస్తోంది. ఓ సముద్రం రెండు వలలు.. విశాఖలోనూ ఇదే వివాదం. సముద్రంలో చేపల వేటకు నిషేధిత వలలు వినియోగిస్తున్నారన్నది కొన్ని గ్రామాల మత్స్యకారుల ఆందోళన. దీనిపై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే రణరంగం తప్పదంటున్నారు. సాధారణంగా సముద్రంలో సీజన్ బట్టి కొన్ని చేపలు దొరికితే మరికొన్ని ఏడాద౦తా దొరుకుతాయి. దీనికి తగ్గట్లుగా ఏ సీజన్‌లో వాడాల్సిన వలలు ఆ సీజన్‌లో వాడుతుంటారు. అదే సమయంలో సముద్రంలో చేపల వేటకు కొన్ని వలలు వాడడంపై నిషేధం ఉంది. ఆ నిషేధిత జాబితాలో రింగు వలలు కూడా ఉన్నాయి. దాదాపు పదేళ్ల కిందటే వీటిని నిషేధించారు. కానీ గత రెండు నెలల నుంచి కొందరు మత్స్యకారులు రింగు వలలు వినియోగిస్తున్నారు. వీటితో మత్స్యసంపదకు తీరనం నష్టం వాటిల్లుతుందని సంప్రదాయ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద చేపల రేవు విశాఖ ఫిషింగ్ హార్బర్. ఇక్కడ దాదాపు 7వ౦దల వరకు మర బోటులు, రెండున్నర వేలకు పైగా ఇ౦జన్ బోటులు ఉన్నాయి. సముద్రంలో చేపల వేట ద్వారా ప్రత్యక్షంగా పదివేల మంది పరోక్షంగా మరో పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. విశాఖ జిల్లాలోనే 63 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ స్థాయిలో వనరులు ఉన్నా.. రింగు వలల వాడకంతో కొద్ది మందికి మాత్రమే లాభం చేకూరుతోంది. ఈ వలలతో మత్స్యసంపద ప్రమాదంలో పడుతోంది. AP MFR 1995 చట్టం ప్రకారం అ౦గుళ౦ క౦టె చిన్న కన్ను ఉన్న వలల వాడకాన్ని ఎప్పుడో నిషేధించారు. పదేళ్ల క్రితం రింగువలలు నిషేధించాలని కోర్టులో పోరాడి మత్స్యకారులు విజయం సాధించారు. కానీ గత రెండు నెలల నుంచి కొందరు ఈ వలలను వాడుతున్నారు. ఇందేంటని ప్రశ్నిస్తే తమపై దాడులకు దిగుతున్నారని సంప్రదాయ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రింగువలల నిషేధాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.