ICC ODI World Cup 2027: వరల్డ్ కప్ 2027 రూల్స్ ఇవే.. బౌండరీ లైన్ నుంచి సూపర్ ఓవర్ వరకు ఐసీసీ కీలక మార్పులు
ICC ODI World Cup 2027: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్, కొత్త రూల్స్ వచ్చేశాయి. 14 జట్లు, సూపర్ సిక్స్ ఫార్మాట్ తో ఈసారి టోర్నీ మరింత రసవత్తరంగా మారనుంది. ఈసారి టోర్నీ ఫార్మాట్ ఏంటి? ఎన్ని జట్లు పాల్గొంటాయి? కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

ICC ODI World Cup 2027: క్రికెట్ లవర్స్‌కు అతిపెద్ద పండుగ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 (ICC ODI World Cup 2027) ముంగిట్లోకి వచ్చేస్తోంది. వచ్చే ఏడాదే ఈ మెగా టోర్నీ జరగనుండటంతో ఇప్పుడే దీనిపై చర్చ మొదలైంది. ఈసారి టోర్నీ ఫార్మాట్ ఏంటి? ఎన్ని జట్లు పాల్గొంటాయి? కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి? అన్న విషయాలపై ఐసీసీ ఇప్పటికే ఒక స్పష్టతనిచ్చింది. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు తలపడనున్నాయి. వీటికి ఎంట్రీ ఇచ్చే విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆతిథ్య దేశాలుగా ఉన్న సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేలకు నేరుగా టోర్నీలో చోటు దక్కుతుంది. మరో హోస్ట్ నమీబియా మాత్రం క్వాలిఫైయింగ్ రౌండ్ ఆడి గెలవాల్సి ఉంటుంది. ఇక మార్చి 31, 2027 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లకు నేరుగా బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. మిగిలిన 4 స్థానాల కోసం 10 జట్ల మధ్య క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ జరుగుతుంది. అంటే ఈసారి పోటీ చాలా టఫ్ గా ఉండబోతోంది.
సూపర్ సిక్స్ ఫార్మాట్.. అదిరిపోయే ట్విస్ట్
ఈసారి ఐసీసీ పాత పద్ధతిని పక్కన పెట్టి సూపర్ సిక్స్ ఫార్మాట్‌ను తీసుకొచ్చింది. 14 జట్లను రెండు గ్రూపులుగా (గ్రూప్-ఏ, గ్రూప్-బి) విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 7 జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి టీమ్ తన గ్రూప్‌లోని మిగిలిన జట్లతో తలపడుతుంది. రెండు గ్రూపుల నుండి టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అక్కడ పాయింట్ల వేట ముగిశాక, టాప్-4లో ఉన్న జట్లు సెమీఫైనల్స్ కు వెళ్తాయి. ఆ తర్వాత ఫైనల్ పోరు జరుగుతుంది. దీనివల్ల ప్రతి మ్యాచ్ చావో రేవో అన్నట్టుగా మారుతుంది.
వరల్డ్ కప్ 2027లో అమలయ్యే 3 కీలక సూత్రాలు
ఈసారి టోర్నీలో ఐసీసీ మూడు ముఖ్యమైన నియమాలను కచ్చితంగా అమలు చేయనుంది. అవి:
సూపర్ ఓవర్ తప్పనిసరి: 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించిన వివాదం మనందరికీ గుర్తే. అందుకే 2023లో తెచ్చిన సూపర్ ఓవర్ రూల్ ఇక్కడ కూడా కొనసాగుతుంది. మ్యాచ్ టై అయితే ఎన్ని సార్లైనా సూపర్ ఓవర్ నిర్వహించి విజేతను తేలుస్తారు.
నో సాఫ్ట్ సిగ్నల్: ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్ వల్ల గతంలో చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు ఆ రూల్ లేదు. థర్డ్ అంపైర్ దగ్గర పక్కా ఆధారాలు ఉంటేనే అవుట్ ఇస్తారు, లేదంటే అంపైర్ డెసిషన్ లో మార్పు ఉండదు.
బౌండరీ డిస్టెన్స్: స్టేడియం బౌండరీలు చిన్నవిగా ఉంటే బ్యాటర్లకు లాభం కలుగుతుంది. అందుకే ఏ స్టేడియంలో అయినా బౌండరీ లైన్ 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదని ఐసీసీ నిబంధన విధించింది.
వేదికలు, షెడ్యూల్ విశేషాలు
ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా ప్రధాన వేదికగా ఉండగా, జింబాబ్వే మరియు నమీబియాలోని కొన్ని స్టేడియాలను కూడా వాడుకోనున్నారు. ఆఫ్రికా గడ్డపై పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయని మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వరల్డ్ కప్ లో బౌలర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టీమ్ ఇండియా ఇప్పటికే తన కోర్ టీమ్ ను సిద్ధం చేసే పనిలో పడింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉంటే మనకు డైరెక్ట్ ఎంట్రీతో పాటు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది.
