Vaibhav Sooryavanshi : సచిన్, కోహ్లీల రికార్డులన్నీ గాల్లో కలిసిపోవాల్సిందే.. వైభవ్‌పై మాజీ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్, కోహ్లీల రికార్డులను మించే సామర్థ్యం అతనికి ఉందని ప్రశంసించాడు. ఇదే సమయంలో ఐర్లాండ్ అల్లర్ల కారణంగా వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

Vaibhav Sooryavanshi : గత ఏడాది కాలంగా భారత క్రికెట్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న ఏకైక పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ పూర్తిగా ఈ వండర్‌కిడ్ పేరుతోనే నడిచింది. టోర్నీలో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న దశాబ్దాల కాలం నాటి రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అతి పిన్న వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన క్రీడాకారుడిగా వైభవ్ సరికొత్త రికార్డు లిఖించాడు.
సచిన్, కోహ్లీలను మించిపోతాడన్న డేల్ స్టెయిన్
వైభవ్ సూర్యవంశీ టాలెంటు పై ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియాతో పాటు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ డేల్ స్టెయిన్ ఈ క్రేజీ కుర్రాడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ భవిష్యత్తు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల కంటే వెయ్యి రెట్లు బ్రైట్‌గా ఉంటుందని స్పష్టం చేశాడు. కెరీర్ ముగిసే సమయానికి సచిన్, విరాట్ ఇద్దరి లెగసీని కలిపినా.. వైభవ్ అంతకంటే పెద్ద సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని 42 ఏళ్ల స్టెయిన్ అంచనా వేశాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న చాలా మంది సీనియర్ ఆటగాళ్ల కంటే ఈ 15 ఏళ్ల పిల్లోడే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని కొనియాడాడు.
బీసీసీఐకి స్టెయిన్ పెట్టిన ఒకే ఒక్క కండిషన్
అయితే, వైభవ్ సూర్యవంశీ ఇంతటి గొప్ప స్థాయికి చేరాలంటే బీసీసీఐ ఒక ముఖ్యమైన కండిషన్ పాటించాలని డేల్ స్టెయిన్ సూచించాడు. ఇంత చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్, బాధ్యత రావడం వల్ల అతడిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలని చెప్పాడు. “వైభవ్ భారత క్రికెట్‌కు దొరికిన ఒక అమూల్యమైన నిధి. అంతా బాగానే ఉంది కానీ, ఈ వయసులో అతడిని సరిగ్గా చూసుకోకపోతే, కెరీర్ మధ్యలోనే దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. గొప్ప బాధ్యతతోనే గొప్ప ప్రతిఫలం వస్తుంది. కాబట్టి టీమ్ మేనేజ్‌మెంట్ అతడిపై ఒత్తిడి పడకుండా చాలా జాగ్రత్తగా గైడ్ చేయాలి” అని స్టెయిన్ హెచ్చరించాడు.
ఐర్లాండ్ అల్లర్ల వల్ల వైభవ్ డెబ్యూకు బ్రేక్?
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ భారత్ ఏ జట్టుతో కలిసి శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే అతడు సీనియర్ జట్టుతో కలిసి తన తొలి అంతర్జాతీయ పర్యటన కోసం ఐర్లాండ్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఈ లోపే వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం పై అనుకోని సస్పెన్స్ మొదలైంది. ఐర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన బెల్ఫాస్ట్లో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత అల్లర్లు, పౌర హింస చెలరేగడమే దీనికి కారణం.
భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్‌పై నీలినీడలు
బెల్ఫాస్ట్ నగరంలో ఒక స్థానిక వ్యక్తిపై 30 ఏళ్ల శరణార్థి దారుణంగా కత్తితో దాడి చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనకు నిరసనగా స్థానికులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం, అవి కాస్తా అల్లర్లుగా మారి వాహనాలకు నిప్పు పెట్టడం, ఇళ్లను ధ్వంసం చేసే వరకు వెళ్లాయి. అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడంతో భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన రాబోయే టీ20 సిరీస్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటన రద్దయితే.. మన వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున ఆడే మొదటి మ్యాచ్ మరికొంత కాలం ఆలస్యం కాక తప్పదు.
మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
