AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

48 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ! ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..?

1978 జూలై 25న ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ జన్మించింది. ఐవీఎఫ్ (IVF) విధానంతో జన్మించిన ఈ శిశువు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది దంపతులకు సంతాన సాఫల్యాన్ని అందిస్తున్న ఈ సాంకేతికత వెనుక ఉన్న ఆసక్తికర కథ ఇదే.

48 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ! ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..?
World's First Test Tube Bab
SN Pasha
|

Updated on: Jul 26, 2026 | 10:42 AM

Share

1978 జూలై 25న ప్రపంచ వైద్య చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన రోజు. ఈ రోజే ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ జన్మించింది. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా జన్మించిన తొలి శిశువుగా ఆమె వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. నేడు సంతానలేమితో బాధపడుతున్న లక్షలాది దంపతులకు ఆశాకిరణంగా నిలిచిన ఐవీఎఫ్ సాంకేతికతకు ఇదే ప్రారంభం.

ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురుచూపులు

ఇంగ్లాండ్‌కు చెందిన లెస్లీ బ్రౌన్, పీటర్ బ్రౌన్ దంపతులు చాలా సంవత్సరాల పాటు సంతానలేమితో బాధపడ్డారు. లెస్లీ బ్రౌన్ ఫెలోపియన్ ట్యూబ్‌లలో అడ్డంకి ఉండటంతో సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాలేదు. దీంతో అప్పట్లో ప్రయోగాత్మక దశలో ఉన్న ఐవీఎఫ్ చికిత్సను ఆశ్రయించాలని వారు నిర్ణయించుకున్నారు.

ప్రయోగశాలలో పిండం.. గర్భాశయంలో అమరిక

1977 నవంబర్‌లో వైద్యులు లెస్లీ బ్రౌన్ అండాశయం నుంచి ఒక అండాన్ని సేకరించి, దానిని ప్రయోగశాలలో ఆమె భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చేశారు. అనంతరం ఏర్పడిన పిండాన్ని కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భాశయంలో అమర్చారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో 1978 జూలై 25న ఇంగ్లాండ్‌లోని ఓల్డ్‌హామ్ అండ్ డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్‌లో సిజేరియన్ ద్వారా లూయిస్ జాయ్ బ్రౌన్ జన్మించింది. జనన సమయంలో ఆమె బరువు 5 పౌండ్లు 12 ఔన్సులు.

వైద్య ప్రపంచంలో సంచలనం

లూయిస్ జననం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెకు చికిత్స అందించిన బ్రిటిష్ గైనకాలజిస్ట్ పాట్రిక్ స్టెప్టో, శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్ దాదాపు పదేళ్లపాటు ఈ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. అయితే అప్పట్లో ఐవీఎఫ్ విధానంపై అనేక సందేహాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. లూయిస్ గర్భం గురించి తెలిసిన తర్వాత బ్రౌన్ దంపతులు తీవ్ర ప్రజా విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఈ విజయంతో ఐవీఎఫ్ వైద్యరంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

అపోహలకు చెక్

లూయిస్ తర్వాత బ్రౌన్ దంపతులకు రెండో కుమార్తె నటాలీ బ్రౌన్ కూడా ఐవీఎఫ్ ద్వారానే జన్మించింది. అనంతరం 1999లో నటాలీ సహజ పద్ధతిలో గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఐవీఎఫ్ ద్వారా జన్మించిన మహిళలు సహజంగా తల్లులు కాలేరనే అపోహలకు తెరపడింది. అలాగే 2006లో లూయిస్ బ్రౌన్ కూడా సహజంగా గర్భం దాల్చి కుమారుడికి జన్మనిచ్చింది.

నేడు లక్షలాది కుటుంబాలకు వరంగా ఐవీఎఫ్

ప్రస్తుతం ఐవీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా సంతానలేమికి అత్యంత ప్రభావవంతమైన వైద్య చికిత్సల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వివిధ కారణాలతో సహజంగా సంతానం పొందలేని దంపతులకు ఈ సాంకేతికత కొత్త ఆశను కల్పిస్తోంది. అవసరమైతే దాత అండాలు, శుక్రకణాలను ఉపయోగించి కూడా ఐవీఎఫ్ చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రపంచ తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జననం కేవలం ఒక శిశువు పుట్టుక మాత్రమే కాదు.. ఆధునిక వైద్యశాస్త్రంలో కోట్లాది కుటుంబాల జీవితాలను మార్చిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా జన్మించిన లూయిస్ బ్రౌన్ ఇప్పటికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. జూలై 25తో ఆమె తన బర్త్ డే కూడా సంతోషంగా జరుపుకున్నారు.

Follow Us