విద్యార్థుల భవిష్యత్‌కు కేంద్ర రక్షణ కవచం.. పబ్లిక్ పరీక్షల అక్రమాలపై ఉక్కుపాదం!
దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియల్లో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇతర అక్రమాలకు శాశ్వత అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అత్యంత కఠినమైన నిబంధనలతో రూపొందించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 ను సోమవారం (జూలై 26) లోక్‌సభ ముందుకు తీసుకురానుంది.

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, రిక్రూట్‌మెంట్ ప్రక్రియల్లో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇతర అక్రమాలకు శాశ్వత అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అత్యంత కఠినమైన నిబంధనలతో రూపొందించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 ను సోమవారం (జూలై 26) లోక్‌సభ ముందుకు తీసుకురానుంది.
నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే అసాంఘిక శక్తులు, మాఫియా ముఠాల భరతం పట్టడమే లక్ష్యంగా 2024 చట్టంలో కీలక సవరణలు చేశారు. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టం-2024 నుంచే అమలులో ఉంది. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో జరిగే ప్రశ్నాపత్రాల లీకేజీలు అక్రమాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మొట్టమొదటి చట్టమే పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక చట్టం (Public Examinations, Prevention of Unfair Means Act, 2024) ఇది యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్, జేఈఈ, క్యూసెట్ వంటి అన్ని కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు ఇది వర్తిస్తుంది.
ప్రశ్నాపత్రాలు లేదా ఆన్సర్ కీలను లీక్ చేయడం, పరీక్షా కేంద్రాలలో ఇతరులకు అనధికారికంగా సహాయం చేయడం, ఓఎంఆర్ షీట్లతో ట్యాంపరింగ్ చేయడం, నకిలీ వెబ్‌సైట్లు లేదా అడ్మిట్ కార్డులను సృష్టించడం వంటి 15 రకాల చర్యలను అక్రమాలుగా ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఈ చట్టం కింద పరీక్షలు రాసే అభ్యర్థులు, విద్యార్థులను శిక్షల పరిధి నుంచి మినహాయించారు. కేవలం వ్యవస్థీకృత ముఠాలు, అసాంఘిక శక్తులు, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకే ఈ చట్టం వర్తిస్తుంది.
పేపర్ లీకులకు పాల్పడేవారిపై ఉక్కుపాదం
పేపర్ లీకులకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేలా కఠిన శిక్షలు, జరిమానాలు పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు, అక్రమాలకు పాల్పడేవారికి ఎన్నడూ లేని విధంగా భారీ శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించారు. కాపీయింగ్, ప్రాక్సీ అభ్యర్థుల ద్వారా పరీక్షలు రాయించడం వంటి సాధారణ అక్రమాలకు పాల్పడితే విధించే జైలు శిక్షను 5 నుండి 10 సంవత్సరాలకు పెంచారు. అంతేకాకుండా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. గతంలో 3-5 సంవత్సరాల జైలు శిక్ష -10 లక్షల వరకు జరిమానా ఉండేది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలకు పాల్పడే పెద్దపెద్ద ముఠాలు, లీక్ గ్యాంగ్‌లపై మరింత కఠినంగా వ్యవహరించి గరిష్టంగా రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా వసూలు చేయనున్నారు. గతంలో పదేళ్ల వరకు జైలుశిక్ష కోటి రూపాయల జరిమానా ఉండేది. పరీక్షల నిర్వహణ బాధ్యతలను తీసుకుని, అక్రమాలకు లేదా నిర్లక్ష్యానికి కారణమయ్యే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలకు రూ.5 కోట్ల జరిమానా విధించడంతో పాటు, ఆ సంస్థలను 8 సంవత్సరాల పాటు బ్లాక్‌లిస్ట్ చేయనున్నారు. గతంలో కోటి రూపాయల జరిమానా నాలుగేళ్ల పాటు బ్లాక్ లిస్ట్ నిబంధన ఉండేది.
సత్వర న్యాయం-కాలపరిమితితో కూడిన విచారణ
ఇకపై పేపర్ లీక్ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగకుండా, దోషులకు త్వరగా శిక్షలు ఖరారు చేయడానికి ఈ చట్టం కింది కఠిన కాలపరిమితులను నిర్దేశిస్తోంది.. కేసు నమోదైన తేదీ నుండి కేవలం 2 నెలల లోపే దర్యాప్తు పూర్తి చేయడం తప్పనిసరి. కేసులను త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఛార్జ్‌షీట్ దాఖలైన నాటి నుండి కేవలం 3 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని నిబంధన విధించారు. దిగువ కోర్టుల తీర్పులపై హైకోర్టులో అప్పీలు చేసుకునే విషయంలోనూ ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం కింద వచ్చే కేసులకు సంబంధించిన అప్పీళ్లను హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ మాత్రమే విచారిస్తుంది. అంతేకాకుండా, హైకోర్టులో దాఖలైన అప్పీళ్లను కూడా కేవలం 3 నెలల లోపు పూర్తిగా పరిష్కరించాల్సిందేనని స్పష్టమైన మార్గదర్శకాలను పొందుపరిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
