AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్‌పై ఉక్కుపాదం.. నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

రాబోయే నీట్-యూజీ పరీక్షకు మద్దతు కోరేందుకు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం కేంద్ర భద్రతా, నిఘా సంస్థలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షను సురక్షితంగా, పటిష్టంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అప్రమత్తతను పెంచాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.

Dharmendra Pradhan: నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్‌పై ఉక్కుపాదం.. నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
Dharmendra Pradhan
Shaik Madar Saheb
|

Updated on: May 20, 2026 | 5:00 PM

Share

రాబోయే నీట్ (UG) పునఃపరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది.. దీనిలో భాగంగా మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర భద్రతా, నిఘా (ఇంటెలిజెన్స్) ఏజెన్సీల ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యున్నత స్థాయి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షను సురక్షితంగా, పటిష్టంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అప్రమత్తతను పెంచాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ధర్మంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ కూడా పాల్గొన్నారు. ముందుగానే లోపాలను గుర్తించి, సకాలంలో నివారణ, సవరణ చర్యలు తీసుకునేందుకు జరుగుతున్న సన్నాహాలను ఈ సమావేశంలో వివరంగా సమీక్షించారు.

నకిలీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లపై నిఘా

ఈ సమావేశంలో భాగంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన మెటా (Meta), గూగుల్ (Google), టెలిగ్రామ్ (Telegram) ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోటీ పరీక్షల సమయంలో టెలిగ్రామ్ ఛానళ్లు, అనామక ఆన్‌లైన్ గ్రూపుల ద్వారా వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం (Misinformation) పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాన పరీక్షలకు ముందు ఇలాంటి అనేక ఛానెళ్లు అత్యంత చురుకుగా మారి, నకిలీ ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు, క్లిక్‌బైట్ కంటెంట్, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులలో భయాందోళనలు, ఆందోళన, గందరగోళాన్ని రేకెత్తిస్తాయని అధికారులు గుర్తించారని తెలిపారు. ఇలాంటి అనేక లింకులు, తప్పుడు సమాచారాన్ని విస్తరింపజేయడానికి రూపొందించిన ఆటోమేటెడ్ బాట్‌లు, నకిలీ గ్రూపులకు వినియోగదారులను మళ్లిస్తున్నాయని వారు స్పష్టం చేశారు.

వీడియో చూడండి..

ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన సమాచారం ప్రకారం, పరిమిత సంఖ్యలో ఫోన్ నంబర్ల ద్వారా అనేక అనుమానాస్పద ఛానెళ్లు పనిచేస్తున్నాయి. ఇది సమన్వయంతో, వ్యవస్థీకృతంగా జరుగుతున్న కార్యకలాపాలను సూచిస్తోంది.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇలాంటి నెట్‌వర్క్‌లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షలకు ముందు తప్పుడు సమాచారం, ప్రచారం, భయాందోళనలను వ్యాప్తి చేసే ఛానెళ్లను ముందుగానే గుర్తించి, బ్లాక్ చేసి, తొలగించాలని ఆయన సూచించారు.

తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌టిఎ, చట్ట అమలు సంస్థలతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి నొక్కి చెప్పారు.

తప్పుడు కథనాల నుండి విద్యార్థులను కాపాడటం, పరీక్షా ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల అంశమని ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us