మీ వేలికి ఉన్న ఉంగరం మీ ఆరోగ్యాన్ని శాసిస్తుందా? సిటీల్లో కొత్త క్రేజ్.. స్మార్ట్ రింగ్స్‌తో మారుతున్న లైఫ్‌స్టైల్!
Smart Rings: ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. జిమ్, మంచి ఆహారంతో పాటు ఇప్పుడు చాలామంది స్మార్ట్ రింగ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవి నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయిలు, శరీర రికవరీ వంటి అంశాలను నిరంతరం ట్రాక్ చేసి పూర్తి ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాయి.

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం పరిపాటిగా మారింది. అయితే, తాజాగా మెట్రో నగరాల్లోని భారతీయులు తమ హెల్త్ విషయంలో సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. కేవలం జిమ్‌కి వెళ్లడం, మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, ప్రతీ విషయాన్ని లెక్కలతో సహా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా స్మార్ట్ రింగ్స్ ఇప్పుడు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ చిన్న ఉంగరాలు నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయిలు, శరీర రికవరీ స్కోర్‌లను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్య నివేదికను అరచేతిలో ఉంచుతున్నాయి.
ముఖ్యంగా ఈ తరహా గ్యాడ్జెట్లు ధరించేవారు కేవలం నిద్రపోయే సమయాన్ని మాత్రమే కాకుండా, డీప్ స్లీప్, రెస్టింగ్ హార్ట్ రేట్ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఉదాహరణకు, రాత్రి తిన్న ఆహారం ప్రభావం నిద్రపై ఎలా ఉందో ఈ స్మార్ట్ డివైజెస్ ద్వారా తెలుసుకుని, అందుకు అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. పడుకోవడానికి ఐదు గంటల ముందే భోజనం చేయడం, నిద్రకు ముందు కెఫిన్ తీసుకోకపోవడం వంటి క్రమశిక్షణతో కూడిన అలవాట్లను అలవర్చుకుంటున్నారు. ఇక్కడ ఆరోగ్యం అనేది ఒక యాదృచ్ఛిక విషయం కాదు, అది ఒక డేటా ఆధారిత ప్రణాళికగా మారుతోంది.
అయితే ఈ విపరీతమైన డేటా పర్యవేక్షణ కేవలం యువతకే పరిమితం కాలేదు. 60 ఏళ్ల వృద్ధులు సైతం స్మార్ట్ రింగ్స్, యాప్స్ ద్వారా తమ షుగర్ లెవల్స్, నడకను ట్రాక్ చేస్తూ డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించుకుంటున్నారు. స్మార్ట్ వాచీల కంటే ఇవి ధరించడానికి సౌకర్యంగా ఉండటం, బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండటంతో ఇవి నయా ట్రెండ్‌గా మారాయి. మొత్తానికి, హెల్త్ ఈజ్ వెల్త్ అనే మాటను నగరవాసులు హెల్త్ ఈజ్ డేటాగా మార్చేస్తూ, టెక్నాలజీ సాయంతో తమ ఆయుష్షును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
