Telangana: అయ్యో బిడ్డా.. ఎంత పనిచేశావ్.. యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?
ఆన్‌లైన్ గేమింగ్ యువత ప్రాణాలను బలిగొంటోంది. ఎంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో నెల రోజుల్లో ఏడుగురు మరణించడం దీని తీవ్రతను తెలుపుతోంది. చిన్న లాభాలతో ఆశపెట్టి, ఆ తర్వాత పెద్ద నష్టాలను మిగిల్చే ఈ గేమింగ్‌పై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. తాజాగా మరో ప్రాణం ఈ వ్యసనానికి బలైంది.

మొదట ఆశ చూపి.. చివరకు అప్పుల ఊబిలోకి నెట్టి ప్రాణాలను బలితీసుకుంటున్న ఆన్‌లైన్ గేమింగ్ మహమ్మారి మరో యువకుడిని పొట్టనబెట్టుకుంది. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన డిజిటల్ జూదం ఎంత ప్రమాదకరమో మరోసారి చాటిచెప్పింది. సూరారానికి చెందిన 24 ఏళ్ల రవీందర్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను చనిపోయే ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తోంది. “ఆన్‌లైన్ గేమ్స్‌లో పెద్ద ఎత్తున డబ్బు పోగొట్టుకున్నాను.. నన్ను మోసం చేశారు. నా నిర్ణయానికి ఎవరినీ నిందించవద్దు” అంటూ ఆవేదనతో రవీందర్ ఆ వీడియోలో తెలిపాడు. గేమింగ్‌కు బానిసైన రవీందర్ అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
తెలంగాణలో బెట్టింగ్ మరణాల మృత్యుఘోష
రవీందర్ కేసు ఒక్కటే కాదు తెలంగాణలో గత నెల రోజుల్లోనే ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది 26 ఏళ్లలోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల విక్రమ్ బెట్టింగ్ యాప్‌లో లక్ష రూపాయలు పోగొట్టుకుని విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో అప్పుల భారం తట్టుకోలేక తండ్రి, తల్లి, కొడుకు ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లో టాక్సీ డ్రైవర్లు, జేఎన్‌టీయూ విద్యార్థులు సైతం ఈ మాయలో పడి ప్రాణాలు వదిలారు.
ముందు ఆశ.. తర్వాత అప్పు
ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు మొదట చిన్న మొత్తాలను గెలిపించి యూజర్లలో నమ్మకాన్ని కలిగిస్తాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టేలా ప్రోత్సహించి, వరుస ఓటములతో అప్పుల పాలు చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన నష్టాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేక, లోలోపల కుంగిపోతూ యువత డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మనోవైద్యులు విశ్లేషిస్తున్నారు.
కఠిన చర్యలు.. 7 ఏళ్ల జైలు శిక్ష
పెరుగుతున్న మరణాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. కేంద్రం ప్రవేశపెట్టిన Promotion and Regulation of Online Gaming Act 2025 ప్రకారం అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆన్‌లైన్ జూదాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా బెట్టింగ్‌ను ప్రమోట్ చేసే కంటెంట్‌ను బ్లాక్ చేస్తున్నారు. రియల్ మనీ గేమింగ్ ఆపరేటర్లకు ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. డబ్బు సులభంగా వస్తుందని ఆశపడి ఆన్‌లైన్ గేమింగ్ ఉచ్చులో పడకండి. ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ వ్యసనానికి బానిసలైతే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి లేదా కౌన్సెలింగ్ ఇప్పించండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
