అలసి..సొలసి..సింఘు బోర్డర్లో..వయసు మళ్ళిన రైతులకోసం మాసేజ్ సెంటర్, యువ అన్నదాతల సేవానిరతి
రైతుల ఆందోళనలో తాము కూడా ఉన్నామంటూ ఇప్పటికీ ఇంటి ద్యాస పట్టకుండా సింఘు బోర్డర్ లో నిరసన కొనసాగిస్తున్న వృధ్ద రైతులు శారీరకంగా చాలా అలసిపోతున్నారు..
రైతుల ఆందోళనలో తాము కూడా ఉన్నామంటూ ఇప్పటికీ ఇంటి ద్యాస పట్టకుండా సింఘు బోర్డర్ లో నిరసన కొనసాగిస్తున్న వృధ్ద రైతులు శారీరకంగా చాలా అలసిపోతున్నారు. కాళ్ళు, కండరాలు, నడుం నొప్పులతో, ఇతర రుగ్మతలతో సతమతమవుతున్నారు. సుమారు 70 రోజులుగా సాగుతున్న నిరసనోద్యమంలో పాల్గొంటున్న 55 నుంచి 75 ఏళ్ల వృధ్ధ రైతులు ఇలా శారీరక బాధలను ఎదుర్కొంటున్నారు. వీరి కష్టాలు చూసి చలించిన యువ రైతులు ఇటీవలే తాత్కాలిక మాసేజ్ సెంటర్ ను ఏర్పాటు చేసి..కొంతవరకు వీరి శారీరక బాధలకు ఉపశమనం కలిగిస్తున్నారు. ప్లాస్టిక్ ఛైర్లు, రగ్గులు, మ్యాట్ లపై వీరిని కూర్చోబెడుతూ..ఇళ్లలోనే తయారు చేసిన మూలికా తైలాన్నివీరి కాలి మడమలకు, ఇతర నొప్పులకు వాడుతున్నారు.
ట్రాలీలు, టెంట్లల్లో 24 గంటలూ కూర్చోలేక తాము నానా పాట్లు పడుతున్నామని, ఈ మాసేజ్ సెంటర్ వల్ల ఎంతో ఊరట చెందుతున్నామని వృధ్ధ రైతు ఒకరు తెలిపారు. వలంటీర్ రైతులు సమకూర్చుతున్న ఈ స్వల్ప సాధనాలే తమకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మాసేజ్ సెంటర్ ని ఉదయం 5 గంటలకు తెరిచి..సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తున్నామని, రోజు రోజుకీ తమ సేవలు పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోందని యువ రైతులు వెల్లడించారు. వీరి సేవలో తాము తృప్తి పొందుతున్నామన్నారు. ఈ వృధ్ధ అన్నదాతల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు.