Covid-19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వద్దు మహాప్రభో.. ఇళ్లకు తాళాలేసి ఊరు ఖాళీ చేసిన వెళ్లిన గ్రామస్తులు.. ఎక్కడంటే..?
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేయాలంటే.. వ్యాక్సినేషన్ తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఓ గ్రామస్థులు మాత్రం కరోనా వ్యాక్సిన్ వేస్తారనే భయంతో పారిపోయారు.
Karnataka Villagers run away avoid Covid19 Vaccine: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేయాలంటే.. వ్యాక్సినేషన్, నిబంధనలు పాటించడం తప్పనిసరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే.. ఓ గ్రామస్థులు మాత్రం కరోనా వ్యాక్సిన్ వేస్తారనే భయంతో పారిపోయారు. దేశంలో ఒకవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం చాలా మంది నిరీక్షిస్తుండగా.. మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు గ్రామానికి వచ్చిన అధికారుల బృందాన్ని చూసి ముఖం మీద తలపులు వేస్తున్నారు. అంతేకాదు, ఇంటికి తాళం వేసి పలాయనం చిత్తగిస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన కర్నాటక రాష్ట్రంలోని యాద్గిరి తాలుకాలో వెలుగుచూసింది.
కరోనా మహమ్మారికి వ్యాక్సినేషన్ మాత్రమే సరైన మందు అని అందరూ భావిస్తున్న సమయంలో.. టీకాలపై నెలకొన్న భయాలు కొందరికి ఆందోళనకరంగా మారుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లోని గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలు కోవిడ్ వాక్సిన్ తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. తాము ఊళ్లో ఉంటే వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తుందేమోననే భయంతో ఏకంగా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు.
యాద్గిరి తాలుకాలోని కెంచగరహళ్లి గ్రామ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడి తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం, ఇతర దుష్ప్రభావాలు వస్తాయని వీరు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వ్యాక్సిన్ వేయడానికి ఈ గ్రామానికి వెళ్లిన ఆశావర్కర్లకు, వైద్య సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. వారు వచ్చేసరికి ఊరంతా ఖాళీగా కనిపించింది. అక్కడక్కడ కనిపించిన కొందరు మహిళలను వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అధికారులు కోరినప్పటికీ అందుకు నిరాకరించారు. పైగా వ్యాక్సిన్ తీసుకోమని చెబుతున్నా ఎందుకు బలవంతం చేస్తారని ఎదురుతిరిగారు. ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు.
1,350 మంది జనాభా ఉన్న కెంచగరహళ్లిలో కేవలం 40 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఊరి మొత్తం జనాభాలో 45 సంవత్సరాల వయసు దాటినవారు 300మంది ఉండగా, 18 సంవత్సరాలు దాటినవారు 600మంది దాకా ఉన్నారని యాద్గిరి తహశీల్దార్ చెన్నమల్లప్ప చెప్పారు. మూఢనమ్మకాలు, అపోహలు, అవగాహనా రాహిత్యం వల్ల ఇక్కడి ప్రజలు వ్యాక్సిన్ వద్దంటున్నారని ఆయన పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో అధికారులు తండాల ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎంత అవగాహన కల్పించిన ఫలితం లేకుండాపోతుందన్నారు.
— Ramkrishna Badseshi (@Ramkrishna_TNIE) June 22, 2021
ఇటీవల ఒడిశాలోని రాయగడ్ జిల్లాలో గిరిజన తండాలకు వ్యాక్సిన్ వేయడానికి వెళ్లిన అధికారులకు నిరాశే ఎదురైంది. వ్యాక్సిన్ తీసుకుంటే తాము చనిపోతామని వారు చెప్పడంతో.. అధికారులు ఆశ్చర్యపోయారు. వీరిని ఒప్పించడానికి అధికారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ గ్రామంలో టీకాలు వేయడానికి ఆరోగ్యశాఖ అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది. దీంతో వారిని గమనించిన గ్రామస్థులు కోవిడ్ టీకాలు వద్దంటూ.. గ్రామ ఒడ్డున ఉన్న సరయూ నదిలోకి దూకి ఈత కొడుతూ పారిపోయారని రామ్ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
కోవిడ్ టీకా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి అపోహాల గురించి గ్రామస్థులకు అధికారులు వివరిస్తున్నారు. అయినప్పటికీ.. గ్రామస్థులంతా కోవిడ్ టీకాలు వేయించుకునేందుకు అయిష్టత చూపిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తండాలలోని జనం వ్యాక్సిన్ తీసుకునేలా చేయడానికి ఆయా జిల్లాల అధికారులు ఎక్కడికక్కడ సరికొత్త కార్య్రకమాలు రూపొందిస్తున్నారు. మహారాష్ట్రలో స్థానిక పూజారులు, గ్రామ పెద్దలు, ప్రజలకు వైద్యం చేసే వారికి తొలుత వ్యాక్సిన్ ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ప్రజలలో ధైర్యం నింపి వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వచ్చేలా చేయడానికి కృషి చేస్తున్నారు.