జగన్ రాజకీయ మహా ప్రస్థానం …. అంచెలంచెలుగా…

నాన్న వై. ఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన ఆయన తనయుడు ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ మహాప్రస్థానంలో ఎన్నో మలుపులు.. ఎన్నో ఘట్టాలు.. ఒకటా ? రెండా ? ఆయన జీవితమే ఓ తెరచిన పుస్తకం అంటున్నారు ఆయన సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన పదేళ్ల అనంతరం తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా అద్భుతంగా..అత్యున్నత స్థాయికి తెఛ్చి..తాజా ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. ఏపీ ముఖ్యమంత్రిగా […]

జగన్ రాజకీయ మహా ప్రస్థానం .... అంచెలంచెలుగా...
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2019 | 1:27 PM

నాన్న వై. ఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన ఆయన తనయుడు ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ మహాప్రస్థానంలో ఎన్నో మలుపులు.. ఎన్నో ఘట్టాలు.. ఒకటా ? రెండా ? ఆయన జీవితమే ఓ తెరచిన పుస్తకం అంటున్నారు ఆయన సన్నిహితులు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన పదేళ్ల అనంతరం తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా అద్భుతంగా..అత్యున్నత స్థాయికి తెఛ్చి..తాజా ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. ఏపీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేబట్టిన 46 ఏళ్ళ యువకుని పొలిటికల్ లైఫ్ సాధారణమైనదేమీ కాదు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల కి.మీ. పాదయాత్ర చేసి రోడ్లపై, ఎండనక, వాననకా నడుస్తూ ప్రజలతో మమేకమైన ఈయన ఈ స్థాయికి చేరడానికి పడిన కష్టాలు ఇన్నీఅన్నీ కావు. ఒకనాడు అవినీతి కేసుల్లో జైలుశిక్ష అనుభవించినప్పటికీ.. ఆ తరువాత ఎవరి తోడ్పాటూ లేకుండానే క్షేత్ర స్థాయి నుంచి తన పార్టీని అభివృధ్ది చేసినందుకు జగన్ కి చక్కని ఫలితం లభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2009 లో ఏపీలో 1.29 శాతం ఓట్లు దక్కించుకున్న పార్టీ ఆ తరువాత 2014 నాటికి దాదాపు నలభై శాతానికి పైగా ఓట్ల శాతాన్ని సాధించగలిగింది. అలాగే తాజా ఎన్నికల నాటికి అత్యధికంగా 50 శాతం ఓట్లను కొల్లగొట్టగలిగింది. ఇందుకు జగన్ సంకల్ప బలం,, లక్ష్య సాధనకు ఆయన చేసిన కృషే కారణమన్నది నిర్వివాదాంశం. ఈ విజయాన్ని తాము ఊహించనైనా ఊహించలేదని ఆయన సొంత పార్టీ నేతలే అంటున్నారు. తన ఓదార్పు యాత్ర, ప్రజాసంకల్ప యాత్ర ల ద్వారా ప్రజలకు చేరువైనందుకు వారు ఆయనకు ఘన విజయాన్ని అందించారని ఈ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీ చిహ్నం ‘ ఫ్యాన్ ‘ గాలిలో తెలుగుదేశం పార్టీకి చెందిన మహామహులు కొట్టుకుపోయారని వైసీపీ గర్వంగా చెబుతోంది.

దాదాపు 10 సంవత్సరాల క్రితం బెంగుళూరులో రియల్ ఎస్టేట్, పవర్ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ వఛ్చిన జగన్.. తన తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ కి తిలోదకాలు వదిలి కొత్త లక్ష్యాలతో వైసీపీని స్థాపించారు. సమైక్యాంధ్రలో తొమ్మిదేళ్లు, విడిపోయిన ఏపీలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ కేబినెట్ లో మంత్రి పదవులు చేబట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునుఓడించిన ఘనత జగన్ కి దక్కింది. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని చెబుతున్న జగన్.. , తల్లి, సోదరి, భార్య ఇఛ్చిన ఇన్స్ పి రేషనే తనను ముందుకు నడిపిస్తాయని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో పోరాట ధోరణిని ఎంచుకుంటే జగన్ సౌమ్యంగానే సాగారు. మోడీని గానీ ఎన్డీయే ప్రభుత్వాన్ని గానీ పల్లెత్తు మాట అనకుండా సామరస్య ధోరణి పాటించారు. ఆంద్ర రాజకీయాల్లో జాతీయ పార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని ఈ తాజా ఎన్నికల ఫలితాలు నిరూపించాయని జగన్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే టీడీపీ విషయం వేరని, ఆ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం కావడంవల్లే ఓటమి చవిచూసిందని వారు పేర్కొన్నారు. ఏమైనా తమ నాయకుడు జగన్ అనుసరించిన మార్గమే తమ పార్టీకి పెట్టనికోటగా మారిందని వారు చెబుతున్నారు.