IPL 2024: ‘ఐపీఎల్ సక్సెస్‌లో నిజమైన హీరోలు వారే’.. ఒక్కొక్కరికీ 25 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ
IPL 17వ సీజన్ ముగిసింది. ఆదివారం (మే 26) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో KKR విజయం సాధించింది. తద్వారా ముచ్చటగా మూడవసారి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే గత సీజన్లలాగే ఈసారి కూడా చాలా ఐపీఎల్ మ్యాచ్ లకు వర్షం ఇబ్బంది కలిగించింది.
IPL 17వ సీజన్ ముగిసింది. ఆదివారం (మే 26) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో KKR విజయం సాధించింది. తద్వారా ముచ్చటగా మూడవసారి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే గత సీజన్లలాగే ఈసారి కూడా చాలా ఐపీఎల్ మ్యాచ్ లకు వర్షం ఇబ్బంది కలిగించింది. అయితే గ్రౌండ్స్ మెన్స్, ఇతర గ్రౌండ్ సిబ్బంది ఎంతో కష్టపడి మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఏదైనా క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటే గ్రౌండ్స్‌మెన్, పిచ్ క్యూరేటర్లది ప్రధాన పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారు వేడి, వర్షం, ఇతర వాతావరణ సమస్యలను తట్టుకుని పిచ్ ను మ్యాచ్ కోసం మంచి స్థితిలో ఉంచడానికి శతవిధాలా ట్రై చేస్తారు. ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా వీరి పాత్ర మరవలేనిది. ఈ ధనాధన్ లీగ్ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీసీసీఐ గ్రౌండ్స్ మెన్, పిచ్ క్యూరేటర్లకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా ఒక కీలక ప్రకటన చేశారు. ‘ మా ఐపీఎల్ లీగ్ గ్రాండ్ సక్సెస్ కావడంలో నిజమైన హీరోలు గ్రౌండ్ స్టాఫ్. చాలా క్లిష్ట పరిస్థితుల్లో పిచ్ బాగు చేయడానికి వారందరూ ఎంతో కష్టపడ్డారు. ఐపీఎల్‌లోని 10 హోమ్ టీమ్‌ల గ్రౌండ్స్‌మన్, పిచ్ క్యూరేటర్‌లకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, అలాగే మూడు అదనపు వేదికలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు బహుమతిగా ఇస్తున్నాం. మీ కృషికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని జై షా ప్రకటించారు.
IPLలోని చాలా మ్యాచ్ లకు వర్షం ఆటంకం కలిగించింది. ఈ కారణంగానే కొన్ని మ్యాచ్‌లను రద్దు కూడా చేయాల్సి వచ్చింది. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను ప్రారంభించేందుకు గ్రౌండ్స్ మెన్ ఇతర సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు వీరి శ్రమను బీసీసీఐ గుర్తించింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించి వారిని గౌరవించింది. బీసీసీఐ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ చివరి మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్, హైదరాబాద్ రెండు జట్లు తలపడ్డాయి. లీగ్ మొత్తంలో భారీ స్కోర్లతో బెంబేలెత్తించిన హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకు ఆలౌటైంది. ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ కేవలం గంటన్నర వ్యవధిలో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..