GHMC Elections Results 2020 : గ్రేటర్ హైదరాబాద్ ఓటరు మెచ్చినది ఎవరిని.. మేజిక్ ఫిగర్‌ను టచ్ చేయని పార్టీలు.. హంగ్ ఫలితాలు.. ఇప్పుడెలా..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన అధిక్యం కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం దక్కాలంటే 76 సీట్లు సాధించాలి. అయితే ఏ పార్టీ కూడా మేజిక్..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన అధిక్యం కట్టబెట్టలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం దక్కాలంటే 76 సీట్లు సాధించాలి. అయితే ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. 50కి పైగా డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. 46 సీట్లు సాధించిన బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక ఎంఐఎం 42 డివిజన్ కైవసం చేసుకుని మూడో స్థానానికి పరిమితమైంది.
ఫలితాలలను బట్టి గ్రేటర్ మేయర్ పీఠం కోసం ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 202కి చేరనుంది. మేయర్ పీఠం దక్కాలంటే 102 మంది సభ్యుల మద్దతు అవసరం. టీఆర్‌ఎస్‌కు అధికంగా 37, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. టీఆర్ఎస్‌కు ఎక్స్ అఫీషియో కలుపుకున్నా మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 10 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్, ఎంఐఎంలు చేతులు కలపడం అనివార్యంగా మారనుంది.
ఇక బీజేపీకి మేయర్ పీఠం దక్కాలంటే మరో 50 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇందుకోసం ఆ పార్టీ ఇతర పార్టీలతో జత కట్టే అవకాశం లేదు. అయితే గ్రేటర్ పీఠం దక్కకపోయినా టీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ దక్కకుండా చేశామన్న సంతృప్తి ఆ పార్టీలో వ్యక్తమవుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో మేయర్ పీఠం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఇక భవిష్యత్తులో తెలంగాణలో పాగా వేస్తామనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.