Minister S Jaishankar: అమెరికా చేరుకున్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. ‘మిషన్ వ్యాక్సిన్’పైనే ప్రధాన చర్చ..!

కరోనా కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన కేంద్రానికి వ్యాక్సిన్ల‌ కొర‌త‌ ఏర్పడింది. ఈ నేప‌ధ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా ప‌య‌న‌మ‌య్యారు.

Minister S Jaishankar: అమెరికా చేరుకున్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. 'మిషన్ వ్యాక్సిన్'పైనే ప్రధాన చర్చ..!
External Affairs Minister S Jjaishankar
Follow us
Balaraju Goud

|

Updated on: May 24, 2021 | 9:31 AM

Minister S Jaishankar arrived in America: కరోనా మహమ్మారితో భారత్ పోరాటం చేస్తోంది. నిత్యం పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన కేంద్రానికి వ్యాక్సిన్ల‌ కొర‌త‌ ఏర్పడింది. ఈ నేప‌ధ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా ప‌య‌న‌మ‌య్యారు. న్యూయార్క్‌లో బిడెన్ ప్రభుత్వ ఉన్నతాధికారుల‌తో భార‌త్‌, అమెరికా మధ్య కరోనా చికిత్సకు సంబంధించిన సహకారంపై చ‌ర్చించ‌నున్నారు. యూఎన్‌ భద్రతా మండలిలో భారత్‌ ప్రవేశించిన‌ త‌రువాత‌ న్యూయార్క్ పర్యటనకు తొలిసారిగా వ‌చ్చిన‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ట్వీట్‌లో… 2021, జ‌న‌వ‌రి ఒక‌టిన‌ భద్రతా మండలిలో భారత్ ప్రవేశించిన తరువాత తొలిసారిగా ఇక్క‌డ‌కు వ‌చ్చిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, జైశంకర్ అమెరికా పర్యటన ఇవాళ్టి నుంచి మే28 వరకు ఉంటుందని విదేశాంగ శాఖ గతవారంలో తెలిపింది. విదేశాంగ మంత్రి జైశంక‌ర్ న్యూయార్క్‌లోని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కలుసుకోనున్నారు. అనంత‌రం వాషింగ్టన్ డీసీలో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చర్చించనున్నారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అమెరికా కేబినెట్ సభ్యులు, సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను కూడా జైశంక‌ర్ చర్చలు జరపనున్నారు.

అలాగే, కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో పాల్గొన్న వివిధ యుఎస్ సంస్థలతో భారత్ చర్చలు జరుపుతోంది. కోవిడ్ టీకాలను కొనుగోలు చేయడానికి, మరింత ఉత్పత్తి చేయడానికి సంబంధించిన అంశాలపై జయశంకర్ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులతో పాటు ఇతర ఔషధ కంపెనీల ప్రతినిధులతో జైశంకర్ ఇంటరాక్షన్ సమయంలో వ్యాక్సిన్ సేకరణ సమస్య ఒక ప్రధాన ఎజెండా అంశంగా భావిస్తున్నారు. 80 మిలియన్ టీకాలను అవసరమైన దేశాలకు పంపిణీ చేయబోతున్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం తీవ్రంగా ప్రభావితమైంది. కాగా, తన పర్యటన సందర్భంగా దేశంలో ఉత్పత్తి చేయడానికి టీకా తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి విదేశాంగ మంత్రి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆస్ట్రా జెనెకా, ఫైజర్, మోడరన్, జాన్సన్ & జాన్సన్ సంస్థలు ఇప్పటికీ వ్యాక్సి్న్స్ ఉత్పత్తి చేసి విజయవంతంగా పంపిణీ చేస్తున్నాయి.

కాగా, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడంలో అమెరికా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది ఇప్పటికే ఒక పెద్ద ఆక్సిజన్ ప్లాంట్, రెమెడిసివర్ వంటి ముఖ్యమైన ఔషధాలను, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కావల్సిన ముడి పదార్థాలను అందించింది.

Read Also…  వ్యాక్సిన్ల కొనుగోలులో జాప్యం….ఇప్పటికైనా మేల్కొనాలంటున్న ప్రముఖ వైరాలజిస్ట్, థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని సూచన