TS Inter English Practical Test: ఫిబ్రవరి 16న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలపై ప్రాక్టికల్ టెస్ట్
వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఇంటర్ స్థాయిలోనే విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యం ప్రయోగ పరీక్షను ప్రభుత్వం ఈ ఏడాది నుంచి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 16న ఆంగ్ల భాషా నైపుణ్యం ప్రయోగ పరీక్షను ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు నిర్వహించనుంది. విద్యార్థులందరూ తప్పకుండా ఈ పరీక్షకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తంగా 100 మార్కుల్లో 80 మార్కులు థియరీకి..
హైదరాబాద్, ఫిబ్రవరి 6: వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఇంటర్ స్థాయిలోనే విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యం ప్రయోగ పరీక్షను ప్రభుత్వం ఈ ఏడాది నుంచి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 16న ఆంగ్ల భాషా నైపుణ్యం ప్రయోగ పరీక్షను ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు నిర్వహించనుంది. విద్యార్థులందరూ తప్పకుండా ఈ పరీక్షకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తంగా 100 మార్కుల్లో 80 మార్కులు థియరీకి కేటాయించగా.. మిగిలిన 20 మార్కులను ప్రయోగాలకు కేటాయించారు. నాలుగు దశల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులకు గానూ కనీసం 7 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులవుతారు. గైర్హాజరైన విద్యార్థులను ఆనుత్తీర్ణులుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకూ మూడు విడతల్లో ప్రయోగ పరీక్షలు జరిగాయి. చివరి విడత పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనుండగా ఇందుకోసం ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల ప్రయోగాలకు హాజరుకాని విద్యార్ధులు కూడా నాలుగో విడతలో హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.
ఆంగ్ల ప్రయోగ పరీక్షను పరికరాలతో కాకుండా తరగతి గదిలోనే విద్యార్థుల భాషా సామర్థ్యాల పరిశీలనతో నిర్వహిస్తున్నారు. కమ్యూనికేషన్ ఫంక్షన్.. మొదటి దశలో ఏదైనా ఒక అంశంపై ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు సంభాషించుకునే తీరును అధ్యాపకులు పరీక్షిస్తారు. రెండో దశలో ‘జస్ట్ ఎ మినిట్’ పేరిట ఏదైనా ఒక అంశంపై నిమిషంలోపు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడాల్సి ఉంటుంది. మూడో దశ ‘రోల్ ప్లే’లో తల్లిదండ్రులు లేదా మరేదైనా అంశంపై విద్యార్థులు గ్రూప్ డిస్కషన్ చేయాలి. ఫిబ్రవరి 16న జరిగే నాలుగో దశలో ‘లిజనింగ్ కాంప్రహెన్సివ్’ పేరిట గ్రహించే శక్తి పెంపొందించడంపై పరీక్ష ఉంటుంది. ఈ నాలుగు దశలతోపాటు రికార్డు బుక్ ఆధారంగా కూడా మార్కులు కేటాయిస్తారు.
ఫిబ్రవరి19న పర్యావరణ విద్య
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రతీయేట మాదిరిగానే ఈసారి కూడా నైతికత- మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్ష జరగనుంది. అయితే ఈసారి కొత్తగా ఆంగ్లంలో ప్రయోగ పరీక్ష ఉండటంతో రెగ్యులర్ విద్యార్థులకు నైతికత- మానవ విలువలు అనే ఆంశంపై పరీక్ష నిర్వహించడం లేదు. గతంలో అనుత్తీర్ణులైన వారికి మాత్రమే ఫిబ్రవరి 17న ఈ పరీక్ష ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 19న నిర్వహించే పర్యావరణ విద్య పరీక్ష మాత్రం రెగ్యులర్ విద్యార్థులు కూడా రాయాల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.