Death Spots: మరణ మృదంగం మోగిస్తున్న ప్రధాన రహదారి.. ఏడాది కాలంలో 37 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు

రోడ్డు డెత్‌ స్పాట్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆ రూట్‌లో వెళ్లితే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అన్నంతలా! ద్విచక్రవాహనం, త్రిచక్ర వాహనం.. భారీ వాహనం ఇలా ఏదైనా.. అంతే..

Death Spots: మరణ మృదంగం మోగిస్తున్న ప్రధాన రహదారి.. ఏడాది కాలంలో 37 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు
Death Spots National Highway Roads
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 05, 2021 | 10:23 AM

Death Spots National Highway Roads: రోడ్డు డెత్‌ స్పాట్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆ రూట్‌లో వెళ్లితే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అన్నంతలా! ద్విచక్రవాహనం, త్రిచక్ర వాహనం.. భారీ వాహనం ఇలా ఏదైనా.. అంతే.. అక్కడికి వెళ్లిందంటే స్లిప్‌ కావాల్సిందే. ప్రాణం పోవాల్సిందే. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏడాది కాలంలో 37 నిండు జీవితాలు తారు రోడ్డు కింద నలిగి పోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. కొన్ని కుటుంబాలే బలి అయ్యాయి. ఎంతో మంది వికలాంగులుగా మారి.. జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీస్తున్నవారున్నారు. ఆస్పత్రుల పాలై ప్రాణాలతో బయట పడిన వారున్నారు.

ఇది ఎక్కడో కాదు. ఓ నేషనల్‌ హైవేపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల లెక్క. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని రోడ్డు నిత్యం రక్తం తాగుతోంది. ఏ రేంజ్‌లో అంటే.. రోడ్డుకు ఏమైనా దాహం వేస్తుందా అన్న స్థాయిలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం తీర్ధయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ ఫ్యామిలీ మొత్తం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అది కూడా నిత్యం జనాన్ని మింగేస్తున్న చోటు కావడమే మరో ఘోరం. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. క్షణాల్లోనే ఆ కారును వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదానికి.. ఏకంగా ఓ కుటుంబమే బలైపోయింది. తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వీరయ్య, వరలక్ష్మి, మణికంఠ, స్వాతిగా పోలీసులు గుర్తించారు. కారులోనే ఉన్న లిఖిత అనే యువతి మాత్రం తీవ్ర గాయాలతో బయట పడింది. ముందు లారీ.. వెనుక నుంచి కారు బలంగా ఢీకోవడంతో.. మధ్యలో ఉన్న కారు నుజ్జు నుజ్జయింది. అందులో ఉన్న వారు.. క్షణాల్లోనే మాంసపు ముద్దలుగా మారారు. కనీసం గుర్తు పట్టడానికి కూడా వీళ్లేనంతగా వాళ్ల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు.

జాతీయ రహదారిపై కొంతకాలంగా బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ వాహన రాకపోకలకు కొంత ఇబ్బందిగా మారింది. అదే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ స్పీడ్ కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందా? లేక ఇంకేమైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రదేశంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు లేక పోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

రోడ్డుపై ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నా చిన్న హెచ్చరిక బోర్డు కూడా ఆ సమీపంలో లేదు. ఇదే కాదు.. ఎలాంటి ముందు జాగ్రత్తలు కూడా లేవు. మొదటి నుంచి ఆర్‌ అండ్‌ బీ అధికారులు రోడ్డు నిర్మాణంలోనే లోపం ఉందని నేషనల్‌ హైవే అథారిటీకి సమాచారం ఇచ్చారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రమాదాల నివారణకు హెచ్చరికల బోర్డులు కూడా పెట్టలేదు. ఎందుకంటే.. కిలోమీటరున్నర వరకు రోడ్డు ప్రమాదకరంగా ఉంటుంది. ఈ దూరం దాటే వరకు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వాహనం ప్రమాదానికి గురి కవాల్సిందే. ఏడాది కాలంలో దాదపు వంద వరకు ప్రమాదాలు జరిగాయి. వీటిలో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో క్షతగాత్రులుగా మారి ఆస్పత్రిలో చికిత్స పొందారు. పలువురు వికలాంగులుగా మారి జీవచ్ఛావాలుగా బతుకు ఈడ్చుతున్నారు.

ఇంత జరుగుతున్నా.. నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీనిపై శాశ్వత పరిష్కారం కూడా చేయడం లేదు. కాలం గడుస్తున్నా.. ప్రమాదాలు జరుగుతున్నా.. అసలు కారణం ఏంటో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు అధికారులు. రోడ్డు నిర్మాణంలోనే లోపమా? రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన ప్లాన్‌లో ఏమైనా లోపం ఉందా? రోడ్డు కన్‌స్ర్టక్షన్‌లో ఏదైనా లోపం ఉందా? అన్నదానిపై ఎక్కడా క్లారిటీ లేదు. ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టి.. శాశ్వత పరిష్కారం చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరెన్నో విలువైన ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయమంటున్నారు స్థానికులు.

Read Also…  Road Accident: అతి వేగం.. నిర్లక్ష్యం.. ఆరుగురి ప్రాణాలు బలి.. ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన కారు