Telangana Vaccination : తెలంగాణలో నేటి నుంచి వ్యాక్సినేషన్ షురూ.. వారికే తొలి ప్రాధాన్యత..!

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి తిరిగి మొదలవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Telangana Vaccination : తెలంగాణలో నేటి నుంచి వ్యాక్సినేషన్ షురూ.. వారికే తొలి ప్రాధాన్యత..!
Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: May 25, 2021 | 7:33 AM

Telangana Covid 19 Vaccination: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి తిరిగి మొదలవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా నిలచిపోయిన టీకా పంపిణీ ప్రారంభిచాలని అధికారులను ఆదేశించారు. నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించాలన్నారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగినవారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ వాక్యినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అలాగే, సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ నిర్వహించాలని అన్నారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణలో కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. తాజాగా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్‌కి తోడు ఇప్పుడు ఎల్లో ఫంగస్ కూడా తోడైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎల్లో ఫంగస్ తొలి కేసు బయటపడింది. ఇది మిగతా ఫంగస్‌ల కంటే ఎక్కువ ప్రాణాంతకమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడం, నీరసం, ఆకలి లేకపోవడం, గాయాలైతే కంటిన్యూగా చీము కారడం వంటివి ఈ ఎల్లో ఫంగస్ లక్షణాలు. అయితే… దీనికి యాంఫోటెరిసిస్-B ఇంజెక్షన్లను రోజూకు 6 నుంచి 8 ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఈ మందుల కొరత ఉంది. ఫార్మా కంపెనీలు చేస్తున్న ఉత్పత్తి సరిపోవట్లేదు.

రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను మంగళవారం నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని, ఇందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేసిన ప్రభుత్వం.. తర్వాత 60ఏళ్లు నిండిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 55లక్షల 26వేల 985 డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు వేసుకున్న వారు 44లక్షల 53వేల 573 మంది ఉండగా… రెండు డోసులూ పూర్తయిన వారు 10లక్షల 73వేల 412 మంది ఉన్నారు. రాష్ట్రానికి సోమవారం 2.54 లక్షల డోసుల కోవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. వీటితో కలిపి సుమారు 4లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక కోవాగ్జిన్‌ డోసులు 53 వేలు నిల్వ ఉండగా.. మంగళవారం మరో 50 వేల డోసులు రానున్నాయని వివరించారు. కాగా.. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మందికి కోవాగ్జిన్‌ రెండో డోసు ఇవ్వాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచే 18-45 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా.. టీకాల కొరతతో చాలా రాష్ట్రాల్లో ఈ వయసు వారికి టీకాల పంపిణీ జరగడం లేదు. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా వస్తున్న టీకాల స్టాకుతో వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇలా మాటిమాటికి టీకాల పంపిణీ ఆపడం సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త విధానాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టింది. కొద్దిరోజుల పాటు పంపిణీ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాకు మేరకు క్రమపద్ధతిలో టీకాలు ఇస్తూ.. నిరంతరాయంగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందిస్తోంది.

ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి రెండో డోసు టీకాలు వేస్తున్నారు. దీనితోపాటు 45 ఏళ్లు నిండిన వారందరికీ తొలి డోసు మొదలుపెట్టాలని.. 30 ఏళ్లు నిండిన వారిని కేటగిరీలుగా గుర్తించి టీకాలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో తప్పనిసరిగా బయటికి రావాల్సి ఉన్న రంగాల వారికి తొలుత వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు, రవాణా, గ్యాస్‌ పంపిణీ, పెట్రోల్‌ బంకుల సిబ్బంది.. వివిధ కేటగిరీలుగా విభజించి ప్రాధాన్యతా క్రమంలో టీకాలు వేస్తారు. అంతేకాకుండా వ్యాక్సినేషన్‌కు సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. రెగ్యులర్‌గా నిర్వహించే కేంద్రాలతోపాటు మొబైల్‌ కేంద్రాలనూ సిద్ధం చేయనుంది. ఈ మొత్తం ప్రణాళిక సిద్ధంకాగానే.. సీఎం ఆమోదంతో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.

Read Also…  Telangana Lockdown: తెలంగాణలో మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగింపు.? ఆ రోజే అధికారిక ప్రకటన.!!