అడిగినా కరోనా టెస్ట్ చేయలేదు.. రెండు రోజులకే యువకుడి మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. కరోనా సోకిందేమోనని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తిని లక్షణాలు లేవని పరీక్షించకుండా వైద్య సిబ్బంది తిప్పి పంపించారు. ఇంటికే చేరుకున్న వ్యక్తి రెండు రోజులకే మృత్యువాతపడ్డాడు.
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. కరోనా సోకిందేమోనని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తిని లక్షణాలు లేవని పరీక్షించకుండా వైద్య సిబ్బంది తిప్పి పంపించారు. ఇంటికే చేరుకున్న వ్యక్తి రెండు రోజులకే మృత్యువాతపడ్డాడు. అటు కరోనా అనుమానంతో సాయం చేయడానికి ఎవరూ రాకపోవడంతో ఆ యువకుడి మృతదేహాన్ని జేసీబీ సాయంతో శ్మశానవాటికకు తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రామాపురానికి చెందిన ఇద్దరు యువకులు మరో గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులతో కలిసి వారం క్రితం తిరుపతి వెళ్లి వచ్చారు. ఇందులో ఒకరు కరోనా లక్షణాలు కనిపించి మూడు రోజుల క్రితం పరీక్ష చేయించుకోగా అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్సపొందుతున్నాడు. ఆయనతో పాటు వెళ్లిన మరో యువకుడు(32) తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తనకూ కరోనా సోకిందేమోనని పరీక్ష చేయాలని స్థానిక ఏఎన్‌ఎంని కోరాడు. ప్రైమరీ కాంటాక్టుకు కరోనా లక్షణాలు కనిపించకపోతే పరీక్షకు సిఫార్సు చేయలేమని వైద్యసిబ్బంది నిరాకరించారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి తీవ్రంగా అనారోగ్యానికి గురైన అతడు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ బుధవారం కన్నుమూశాడు. వైద్య సిబ్బంది అలసత్వంతోనే నిండు ప్రాణం బలైందని కుటుంబసభ్యలు ఆరోపించారు. ఇక, యువకుడి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు సైతం సహాకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని జేసీబీ తొట్టిలో వేసుకుని తీసుకెళ్లారు. విషయం తెలిసిన తహసీల్దార్.. కుటుంబ సభ్యులకు పీపీఈ కిట్లు అందించి దహనసంస్కారాలు చేయించారు. కాగా, వైద్యులు పరీక్ష చేసి చికిత్స అందించి ఉంటే యువకుడు బతికేవాడని కుటుంబసభ్యులు, గ్రామస్థులు వాపోయారు.