Hyderabad: అయ్యో భగవంతుడా.. ఇంతకంటే విషాదం ఉంటుందా..?
మాటలకందని విషాదం ఇది. రెండేళ్లకే చిన్నోడికి నూరేళ్లు నిండిపోయాయి. చిన్న నిర్లక్ష్యం పసి ప్రాణాన్ని బలిగొంది. ఇప్పుడు బాలుడి పేరెంట్స్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటన తాలూకా డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కారు ఢీకొని శివ అనే రెండు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే… హన్మకొండకి చెందిన జయంత్, దివ్య దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. జయంత్ పీర్జాదిగూడ 2 వ డివిజన్ పంచవటి కాలనీలోని ప్రియా ఎంక్లేవ్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఓ గదిలో వారు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో విష్ణు తేజ అనే యువకుడు తాజాగా ఆ అపార్ట్‌మెంట్ కారులో వచ్చాడు. సరిగ్గా గమనించకపోవడంతో.. అతడి కార్ బాలుడిని ఢీకొంది. దీంతో బాలుడు శివ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో చిన్నోడి పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కారు స్పీడుగా నడపడంతో ప్రమాదం జరిగి.. తమ కుమారుడు మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఇటువంటి ప్రమాదాలు ఇటీవల తరుచుగా వెలుగుచూస్తున్నాయి. పిల్లలు వెళ్లి కార్లలోకి ఎక్కడం.. ఆ తర్వాత డోర్లు లాకయిపోయి ఊపిరాడక మృతి చెందడం వంటి ఘటనలు కూడా జరిగాయి. పిల్లల తల్లిదండ్రులతో పాటు కార్లు, వాహనాలు నడిపేవారు కాస్త జాగ్రత్తగా ఉంటే.. ప్రమాదాల నుంచి చిన్నారులను కాపడవచ్చు. బీ కేర్‌ఫుల్.. ఈ ఇంట జరిగిన విషాదం ఏ ఇంట జరగకూడదని కోరుకుందాం…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
