నలుగురు ఎంపీల తరువాత.. ఇక ఎమ్మెల్యేలపై కమలనాథుల వల !
సైలెంట్ గా నలుగురు టీడీపీ ఎంపీలను తమలోకి ‘ లాగేసుకున్న ‘ బీజేపీ… ఇక ఇదే (టీడీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై కూడా ఇలాగే వలలోకి లాగే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ స్పష్టం చేయడంతో.. ఫిరాయింపుల నిషేధ చట్టం పరిధిలోకి రాకుండా.. కనీసం మూడింట రెండు వంతుల మంది తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులకు గాలం వేసేందుకు పాచిక […]
సైలెంట్ గా నలుగురు టీడీపీ ఎంపీలను తమలోకి ‘ లాగేసుకున్న ‘ బీజేపీ… ఇక ఇదే (టీడీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై కూడా ఇలాగే వలలోకి లాగే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ స్పష్టం చేయడంతో.. ఫిరాయింపుల నిషేధ చట్టం పరిధిలోకి రాకుండా.. కనీసం మూడింట రెండు వంతుల మంది తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులకు గాలం వేసేందుకు పాచిక పన్నుతున్నట్టు సమాచారం. ఏపీ అసెంబ్లీలో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. యాంటీ డిఫెక్షన్ లా ‘ మరక ‘ సోకకుండా ఉండాలంటే వీరిలో 15 మంది కమలం పార్టీలో చేరాల్సి ఉంటుంది. అయితే ‘ ప్రస్తుతానికి ‘ ఇది సాధ్యం కాదు. ఏమైనా-పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. శాసన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది కన్నా తక్కువ మంది మా పార్టీలో చేరిన పక్షంలో.. అది ఫిరాయింపుల నిషేధ చట్టం కిందికే వస్తుందని, అయితే ఈ సమస్య తలెత్తకుండా చూసేందుకు తగిన ‘ జాగ్రత్తలు ‘ తీసుకుంటున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని వారంటున్నారు. ఈ చట్టమనే ఆయుధమే లేకపోతే ఇప్పటికే అనేకమంది శాసన సభ్యుల తమ పార్టీ కండువా కప్పుకుని ఉండేవారన్నది వారి అంచనా. కాగా-విశాఖ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కమలం పార్టీలోకి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే.. ఆయనతో కమలనాథులు కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారట. తాను టీడీపీని వీడే ప్రసక్తి లేదని ఆయన గాంభీర్యంగా చెబుతున్నా.. లోలోన మాత్రం గంటా ఆలోచన కమలం పైనే ఉందని అంటున్నారు. ఇదంతా బీజేపీ మైండ్ గేమా కాదా అన్నది పక్కన బెడితే.. తెలంగాణాలో కాంగ్రెస్ పట్ల టీఆర్ఎస్ పన్నిన ‘ ఆకర్ష ‘ వ్యూహాన్నే ఏపీలో టీడీపీ పట్ల కమలనాథులు పన్నాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణాలో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సరిగ్గా మూడింట రెండువంతులమంది.. అంటే 12 మంది తెరాసలో చేరిపోయారు. పైగా అసెంబ్లీలో తమను తెరాస శాసనా సభాపక్షంలో విలీనమైనట్టుగానే గుర్తించాలని స్పీకర్ ను అభ్యర్థించారు. ఇదే వ్యూహాన్ని ఏపీలో బీజేపీ తెలుగుదేశం పార్టీ పట్ల అనుసరించి సక్సెస్ అయిన పక్షంలో అది టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు పెద్ద దెబ్బే అవుతుంది. సంక్షోభాలు తమ పార్టీకి కొత్తేమీ కాదని ఆయన వ్యాఖ్యానించినప్పటికీ.. పార్టీని కాపాడుకోవడానికి ఆయన కొత్త ప్రయత్నాలేవైనా చేయవచ్చు. అటు-ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సింగిల్ సీటు కూడా గెలుచుకోలేని నేపథ్యంలో.. ఆ పార్టీకి అసెంబ్లీలో శాసన సభా పక్షమంటూ లేదు గనుక.. సభలో టీడీపీ-బీజేపీ విలీనం ఎలా సాధ్యం ? తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరడం రాజ్యాంగబధ్ధమే కావచ్ఛునని ఇందులో లీగల్ చిక్కులేవీ లేవని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. రాజ్యసభలో..బీజేపీలో తమ పార్టీ ఎంపీల విలీనాన్నిటీడీపీ సవాలు చేసినప్పటికీ వారి విలీనం రూల్ బుక్ ప్రకారమే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.