AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమలోత్సాహంపై నీళ్ళు: బీజేపీకి దక్కింది మూడే మూడు

తెలంగాణలో మూడు ఎంపీ సీట్లను పొందిన బీజేపీకి మునిసిపల్ ఎన్నికలు నిజంగానే పెద్ద షాక్ ఇచ్చాయి. పట్టణ ప్రాంతాల్లోనే తమకు బలముందని పదే పదే చెప్పుకునే కమలనాథులకు పట్టణ ప్రాంత ఓటర్లు భారీ ఝలక్ ఇచ్చారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మూడు ఎంపీలు స్థానాలు పొందితే.. వాటి పరిధిలో కనీసం ఒక్క మునిసిపాలిటీలోను కాషాయ ధ్వజాన్ని ఎగురవేయలేకపోయింది బీజేపీ. భైంసా మునిసిపాలిటీలొ మొన్నటికి మొన్న మత ఘర్షణలు జరిగితే దాన్ని ఆసరాగా తీసుకుని గెలుద్దామనుకుంటే.. అక్కడ బీజేపీ […]

కమలోత్సాహంపై నీళ్ళు: బీజేపీకి దక్కింది మూడే మూడు
Rajesh Sharma
| Edited By: Nikhil|

Updated on: Jan 25, 2020 | 7:33 PM

Share

తెలంగాణలో మూడు ఎంపీ సీట్లను పొందిన బీజేపీకి మునిసిపల్ ఎన్నికలు నిజంగానే పెద్ద షాక్ ఇచ్చాయి. పట్టణ ప్రాంతాల్లోనే తమకు బలముందని పదే పదే చెప్పుకునే కమలనాథులకు పట్టణ ప్రాంత ఓటర్లు భారీ ఝలక్ ఇచ్చారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మూడు ఎంపీలు స్థానాలు పొందితే.. వాటి పరిధిలో కనీసం ఒక్క మునిసిపాలిటీలోను కాషాయ ధ్వజాన్ని ఎగురవేయలేకపోయింది బీజేపీ. భైంసా మునిసిపాలిటీలొ మొన్నటికి మొన్న మత ఘర్షణలు జరిగితే దాన్ని ఆసరాగా తీసుకుని గెలుద్దామనుకుంటే.. అక్కడ బీజేపీ రెండో స్థానానికే పరిమితమైంది.

నగర, పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టుందని చెప్పుకునే బీజేపీ నేతలు తాజా మునిసిపల్ ఫలితాలతో ఖంగుతిన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానాల పరిధిలోని మునిసిపాలిటిల్లో సత్తా చాటుతామని చెప్పుకున్న ముగ్గురు ఎంపీలు.. షాక్‌లొ పడిపోయారు. అయితే.. గుడ్డిలో మెల్లగా.. నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ మేయర్ పదవిని దక్కించుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

నిజామాబాద్ ఎంపీ పరిధిలో బోధన్, ఆర్మూర్, భీంగల్, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, రాయికల్ మునిసిపాలిటీల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. బీజేపీ ఎంపీలు మునిసిపల్ ఓటర్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినట్లు ఫలితాలు చాటుతున్నాయి. అటు ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో ఆదిలాబాద్, భైంసాల్లో మాత్రమే ఎంతో కొంత ప్రభావం చూపిన బీజేపీ.. మిగిలిన చోట్ల ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది.

కరీంనగర్ ఎంపీ పరిధిలో బీజేపీ మరింత పేలవమైన ప్రదర్శన చేసింది. ఎక్కడా చెప్పుకోదగిన ఓట్లను పొందలేకపోయింది. ఇంతకాలం పట్టణ ప్రాంతంలో బీజేపీకి పట్టుందని భావించే పరిశీలకులు సైతం బీజేపీ తాజా ప్రదర్శనతో షాక్‌కు గురయ్యారు. అమన్‌గల్‌లో బాగా పట్టున్న ఆచారి సారథ్యంలో అక్కడ విజయపతాకాన్ని ఎగుర వేసిన బీజేపీ దళం.. తుక్కుగూడలో మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ మంత్రాంగంతో పట్టు సాధించింది.

నిజామాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్‌లో హిందూ, ముస్లిం పోటీగా మారిన పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారినట్లు ప్రాథమిక అంఛనాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడి ప్రత్యేక పరిస్థితిని అనుకూలంగా మలచుకునేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ యధాశక్తి ప్రయత్నం చేసినా.. చివరికి మేయర్ పదవిని దక్కించుకోవడంలో వెనుకబడి పోయారు. 24 డివిజన్లను గెలుచుకుని బీజేపీ ఇందూరులో అతిపెద్ద పార్టీగా నిలిచింది. హైదరాబాద్ శివారులోని మీర్‌పేట కార్పొరేషన్‌ను గెలుచుకునే స్థాయిలో ఒకదశలో కనిపించిన బీజేపీ ఆ తర్వాత వెనుకబడిపోయింది. మూడు మునిసిపాలిటీలను దక్కించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీతో సమాన స్థాయిలో బీజేపీ నిల్వడమొక్కటే కమలనాథులకు కాస్త ఊరటనిచ్చే అంశం.