ఆ దేశంలో మహిళలపై సరికొత్త ఆంక్షలు.. ఇంటికి కిటికీలు వద్దు.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదేశాలు..
తాలిబన్ల రాజ్యంలో మహిళలు జీవించే హక్కును కోల్పోతున్నారు. రోజుకో రకమైన కండిషన్ తెస్తూ మహిళలపై తమ దాష్టికాన్ని ప్రదర్శిస్తూ పాలన కొనసాగిస్తున్నారు. స్వచ్చంధ సంస్థలో ఆడవాళ్లకు ఉద్యోగాలు ఇస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని తాజాగా తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు.. మహిళలు బయటకు కనిపించే విధంగా ఇళ్లలో కిటికీలు ఉండరాదని కూడా స్పష్టం చేశారు.
ఆఫ్గనిస్తాన్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం మరింత పెరిగింది. మహిళలపై రోజుకో కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. కార్యాలయాల్లో మహిళలను నియమించుకుంటే దేశంలోని అన్ని జాతీయ, విదేశీ ప్రభుత్వేతర గ్రూపులను మూసివేస్తామని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించింది. తాజా ఉత్తర్వును పాటించడంలో విఫలమైతే, NGOలు దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు తమ లైసెన్స్‌లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఆఫ్గన్ మహిళలు సరిగ్గా ఇస్లామిక్ శిరస్త్రాణాన్ని ధరించనందున ఈ చర్యలు తీసుకున్నారు.
మహిళలు బయటివారికి కనిపించకుండా ఉండేలా..
అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు పూర్తిగా మాట తప్పుతున్నారు. 2021 ఆగస్టులో దేశాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. దేశంలో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. మహిళల విషయంలో తాలిబన్లు మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. ఇంట్లోని మహిళలు బయటివారికి కనిపించకుండా ఉండేలా కిటికీలు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు.
మహిళలు కన్పించకుండా గోడలు కట్టాలి
ఇంట్లో మహిళలు తిరిగే వంట గదులు, బావుల వద్ద ఎటువంటి కిటికీలు నిర్మించకూడదని స్పష్టం చేశారు. మహిళలు కన్పించకుండా గోడలు కట్టాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లల్లో ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబన్ సుప్రీం లీడర్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటికి ఈ నిబంధనల ప్రకారం మార్పులు చేయాలని ఆదేశించారు.
స్వతంత్రంగా వీధిలో నడిచే హక్కు కోల్పోయిన మహిళలు
పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశించారు. మహిళల ఉన్నత చదువులపై, ఈద్ వేడుకల్లో పాల్గొనడం, జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది స్త్రీలపై దారుణ వివక్ష అని మండిపడింది.
ప్రభుత్వాదేశాలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు
దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా బ్యూటీ సెలూన్లపై కూడా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ ప్రకటించారు. తమ ఆదేశాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందేనని హెచ్చరించారు. .ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..