మళ్లీ మొదటికే.. చర్చల్లో కానరాని పురోగతి.. చట్టాల రద్దుపై పట్టువీడని రైతులు.. అసహనం వ్యక్తం చేసిన కేంద్రం

11వ విడత జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా, మరింత పీటముడితో చర్చలు ముగిసాయి

  • Balaraju Goud
  • Publish Date - 10:53 pm, Fri, 22 January 21
మళ్లీ మొదటికే.. చర్చల్లో కానరాని పురోగతి.. చట్టాల రద్దుపై పట్టువీడని రైతులు.. అసహనం వ్యక్తం చేసిన కేంద్రం

11th round of talks  : రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. 11వ విడత జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా, మరింత పీటముడితో చర్చలు ముగిసాయి. ఏడాదిన్నర పాటు చట్టాల అమలు నిలిపివేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి ఇచ్చిన ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ప్రారంభమైన 11వ విడత చర్చల్లో చట్టాలను పూర్తిగా రద్దు చేయడం మినహా మరే ప్రత్యామ్నాయం తమకొద్దని రైతు సంఘాలు ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి.

ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైతు సంఘాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అత్యుత్తమ ప్రతిపాదన రైతుల ముందు ఉంచిందని, అవసరమైన సవరణలు చేసేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రద్దు మాటే మాట్లాడ్డం సమంజసం కాదని అన్నారు. తగిన సవరణలు తీసుకొచ్చే వరకు చట్టాలు అమల్లో లేకుండా సస్పెండ్ చేయడాన్ని మించిన ఉత్తమ ప్రతిపాదన ఇంకేదీ ఉండదని తేల్చి చెప్పారు. తమ ప్రతిపాదనపై రైతు సంఘాలు పునరాలోచించుకుని చెప్పాలంటూ తోమర్, మిగతా మంత్రులు అక్కడి నుంచి నిష్క్రమించారు.

మళ్లీ సాయంత్రం4.45గంటలకు తిరిగొచ్చిన మంత్రులు, రైతుల అభిప్రాయం కోరగా, రైతులు రద్దు మినహా మరే ప్రత్యామ్నాయం లేదని, చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించడం మాత్రమే తమ ప్రతిపాదన అని చెప్పారు. రద్దు మాట తప్ప ఇంకేదైనా ప్రతిపాదనతో రైతులే తమ ముందుకు రావాలని సూచిస్తూ కేంద్ర మంత్రులు సమావేశాన్ని ముగించారు. తదుపరి తేదీ కూడా నిర్ణయించకుండానే ఈ చర్చలు ముగిశాయి.

చర్చలు జరిగిన విజ్ఞాన్ భవన్ నుంచి బయటికొచ్చిన రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రులతో తమకు కనీసం 20 నిమిషాలు కూడా ముఖాముఖి చర్చలు జరగలేదని తెలిపారు. ఏడాదిన్నర పాటు చట్టాలను సస్పెండ్ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కేవలం ఆందోళన చేస్తున్న రైతులను వెనక్కి పంపించడం కోసం మాత్రమేనని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రతిపాదనను ఎలా నమ్మాలని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే చట్టాలను రద్దు చేసి, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించే వరకు తాము వెనక్కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని, ఎప్పుడు అడిగినా, ఎన్నిసార్లు అడిగినా తమ నిర్ణయంలో మార్పు ఉండబోదని రైతు సంఘాల నేతలు వెల్లడించారు.

మరోవైపు, ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచే క్రమంలో తాము గణతంత్ర దినోత్సవం రోజు తలపెట్టిన ట్రాక్టర్ల పరేడ్ కొనసాగుతుందని ప్రకటించారు. చర్చల పేరుతో పిలిచి కొన్ని గంటలపాటు గదిలో ఎలాంటి చర్చలు జరపకుండా తమను వేచి ఉండేలా చేసి ప్రభుత్వం అవమానించిందని మరికొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

Read Also… గణతంత్ర దినోత్సవ పరేడ్‌కి సిద్ధమైన ఏపీ ప్రభుత్వ లేపాక్షి శకటం.. తెలుగుతనం ఉట్టిపడేలా రూపురేఖలు