AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Finger Millet: ఎముకలకు వెయ్యి ఏనుగుల బలం.. గుండె జబ్బుల ముప్పు తగ్గించే చిరుధాన్యం!

రాగులు చూడటానికి ఎంతో చిన్నవిగా అనిపిస్తాయి గానీ, ఇవి అద్భుతమైన క్యాల్షియం గనులు. మన పూర్వీకులు రాగి ముద్ద, రాగి జావను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్లే ఎంతో దృఢంగా ఉండేవారు. నేటి కాలంలో ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో రాగుల ప్రాముఖ్యత మళ్ళీ పెరిగింది.

Finger Millet: ఎముకలకు వెయ్యి ఏనుగుల బలం.. గుండె జబ్బుల ముప్పు తగ్గించే చిరుధాన్యం!
Finger Millets
Nikhil
|

Updated on: Feb 13, 2026 | 6:20 AM

Share

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నా.. అది మన శరీరానికి పూర్తిగా అందుతుందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. రాగుల్లో ఉండే కొన్ని ప్రత్యేక రసాయనాలు క్యాల్షియం గ్రహించకుండా అడ్డుకుంటాయట. రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎవరికి క్యాల్షియం మాత్రలు తప్పనిసరి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.

రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు దండిగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల రాగుల నుంచి సుమారు 340 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. కేవలం క్యాల్షియం మాత్రమే కాకుండా ఐరన్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, జింక్, మెగ్నీషియం, పీచు పదార్థాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు ఊబకాయం, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి గుండెజబ్బుల ముప్పు నుంచి మనల్ని కాపాడతాయి.

రాగుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉన్నప్పటికీ, మన శరీరం దానిని పూర్తిగా గ్రహించదు. దీనికి కారణం రాగుల్లో ఉండే ఫైటేట్స్, ఆక్జలేట్స్. ఈ రసాయనాలు శరీరానికి క్యాల్షియం అందకుండా అడ్డుతగులుతాయి. అంటే రాగుల్లో ఉన్న క్యాల్షియంలో కొంత భాగం మాత్రమే మన శరీరానికి ఉపయోగపడుతుంది. మరోవైపు రాగులు త్వరగా జీర్ణం కావు. అందువల్ల జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారికి రాగులు అంతగా నప్పవు. ఇలాంటి వారు రాగులు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.

మహిళల ఆరోగ్యానికి..

ముఖ్యంగా నెలసరి నిలిచే దశలో ఉన్నవారికి, నెలసరి పూర్తిగా నిలిచిపోయిన మహిళలకు క్యాల్షియం అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారకుండా (Osteoporosis) చూసుకోవడానికి క్యాల్షియం ఎంతో అవసరం. కేవలం ఆహారం ద్వారా మాత్రమే శరీరానికి కావలసినంత క్యాల్షియం లభించడం ఒక్కోసారి కష్టమవుతుంది. అందుకే వైద్యులు క్యాల్షియం మాత్రలను సూచిస్తే ఎటువంటి అశ్రద్ధ చేయకుండా వేసుకోవాలి. మన శరీరం ఆహారం కంటే మాత్రల ద్వారా వచ్చే క్యాల్షియంను ఎక్కువగా సంగ్రహించుకుంటుంది.

డాక్టర్లు సూచించిన క్యాల్షియం మాత్రలతో పాటు రాగులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. రాగులను మొలకెత్తించి వాడటం వల్ల అందులోని పోషకాలు శరీరానికి మెరుగ్గా అందే అవకాశం ఉంది. ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం శారీరక దృఢత్వం కోసం రాగులు ఒక ఉత్తమ చిరుధాన్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్న గింజల్లో దాగి ఉన్న ఈ పెద్ద పోషకాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. రాగుల ప్రయోజనాలను గుర్తిస్తూనే, శరీరానికి అవసరమైన అదనపు పోషకాల కోసం వైద్యుల సలహాలు పాటించడం ఉత్తమం.