Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహాలు సఫారీ వాహనాలపై ఎందుకు దాడి చేయవో తెలుసా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!

ఆఫ్రికాలో సఫారీకి వెళ్లే వారు ఓపెన్ జీప్‌ లలో సింహాలను దగ్గర నుంచి చూసే అవకాశం పొందుతారు. అయితే మనిషికి అత్యంత ప్రమాదకరమైన వన్యప్రాణుల్లో ముందున్న సింహాలు.. వాహనాల్లో ఉన్నవారిని ఎందుకు పట్టించుకోవు..? ఈ ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. దీని వెనుక అర్థవంతమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహాలు సఫారీ వాహనాలపై ఎందుకు దాడి చేయవో తెలుసా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!
Secrets Behind Lion Behavior With Safaris
Follow us
Prashanthi V

|

Updated on: Jun 10, 2025 | 11:31 PM

సింహాలు సహజంగా మంచిని చెడును గ్రహించగలుగుతాయి. శతాబ్దాలుగా వాటిలో ఒక ప్రవర్తన పెరిగింది.. అది మనుషులను ముట్టుకోవడం ప్రమాదకరమని తెలుసుకోవడం. మనుషులు ఉండే ప్రాంతాలనూ.. వారు ప్రయాణించే వాహనాలనూ సింహాలు సాధారణంగా దాటిపోతూ ఉంటాయి. మనుషుల నుంచి అనుకోని ప్రతిఘటన తమకు ప్రమాదం కలిగించవచ్చని అవి గ్రహిస్తాయి.

సింహం కన్ను వాహనాన్ని చూస్తే అది ఒక పెద్ద జీవిలా కనిపిస్తుంది. అంటే వాహనంలో మనుషులు ఉన్నారన్న భావనను సింహం గుర్తించదు. అది మొత్తం వాహనాన్ని ఒకే పెద్ద ఆకృతిగా చూస్తుంది. ఆ భారీ ఆకృతిని ఎదుర్కోవడం ప్రమాదమని వాటికి అనిపిస్తుంది. అందుకే దానికి దూరంగా ఉండాలని భావిస్తాయి. అసలే ఏ వన్యమృగమైనా.. తనకంటే పెద్దదైన జంతువుతో పోటీ పడదు కదా.

ఒకే దారిలో తిరుగుతూ ఉండే సఫారీ వాహనాలను తరచూ చూస్తూ ఉండే సింహాలకు అవి ఎలాంటి హాని కలిగించవని అర్థమవుతుంది. వాహనాల్లో ఉన్నవారు పెద్ద శబ్దాలు చేయకుండా అల్లరి చేయకుండా ఉంటే.. సింహాలు కూడా వాటిని పట్టించుకోవు. స్థిరంగా, ప్రశాంతంగా నడిచే వాహనాలను అవి సహజంగా పక్కన పెడుతాయి.

మనుషుల విషయంలో మృగాలు తాము ఎంత జాగ్రత్తగా ఉండాలో అనుభవాల ద్వారా తెలుసుకున్నాయి. పరిశోధనల ప్రకారం.. బెంగాల్ పులులు, సింహాలు వంటి పెద్ద మాంసాహార జంతువులు శతాబ్దాలుగా మనుషులను దూరంగా ఉంచుకోవాలనే ధోరణిని కలిగి ఉన్నాయి. ఇవి పరిణామం ద్వారా వచ్చిన జాగ్రత్తలు.

వాహనాలు వేగంగా వచ్చినా, సమీపంగా వచ్చి గందరగోళం సృష్టించినా, సింహాలు మొదట హెచ్చరికగా గర్జించవచ్చు. అలాంటి సంకేతాలను పట్టించుకోకుండా వెళ్తే.. అవి వెంటనే ప్రతిస్పందించవచ్చు. అందుకే ప్రతి సఫారీకి ఒక గైడ్ తోడుగా ఉంటారు. సింహాల శరీర భాషను గమనించి పర్యాటకులకు దూరం, శబ్దం, నిశ్శబ్దం వంటి సూచనలను అందిస్తారు.

సింహాలు ఎక్కువగా వేటలో ఉండే సమయం ఉదయం సాయంత్రం. అలాంటి సమయంలో సఫారీకి వెళ్లే వారు గైడ్ చెప్పే సూచనలను ఖచ్చితంగా పాటించాలి. వాహనంలోనే ఉండాలి, ఎక్కడికీ దిగకూడదు, అలజడి చేయకూడదు.. ఇవన్నీ చాలా ముఖ్యం.

కొన్నిసార్లు అరుదుగా దాడులు జరుగుతాయి. ఇటీవలి ఉదాహరణగా.. నమీబియాలో ఒక 59 ఏళ్ల వ్యాపారవేత్త సింహం దాడిలో మరణించాడు. అతను ఒక జీప్‌ పై టెంట్ ఏర్పాటు చేసి అక్కడే పడుకున్నాడు. రాత్రివేళ బయటకు వెళ్లిన సమయంలో సింహం అతనిపై దాడి చేసింది.

సింహాలను చూసేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు సఫారీలో వెళ్లే అవకాశం వస్తే.. వాహనంలోనే ఉండండి, పెద్ద శబ్దాలు చేయకండి. అక్కడ ఉన్న గైడ్ చెప్పే సూచనలను తప్పకుండా పాటించండి. అలాగే సింహాలను గౌరవించండి. ఇలాంటి నియమాలను పాటిస్తే.. సింహాల సహజ జీవితానికి ఆటంకం కలగకుండా అవి మనల్ని తాకకుండా చూసుకోవచ్చు.