Chicken 65: చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చింది.. దాని వెనకున్న మిస్టరీ తెలిస్తే అవాక్కే..
చికెన్ 65 అంటే లొట్టలేసుకుని తినేస్తాం.. కానీ ఆ పేరు వెనుక ఉన్న పెద్ద మిస్టరీ ఏంటో మీకు తెలుసా.. 1965లో పుట్టిందా.. 65 ముక్కలుగా కోస్తారా.. లేక తయారీ విధానం,పదార్థాల వల్ల దానికి ఆ పేరు వచ్చిందా..? మనం తినే ఈ ఫేవరెట్ స్టార్టర్ హిస్టరీ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కొందరికీ అయితే చికెన్ లేకపోతే ముద్దే దిగదు. ప్రతి రోజు చికెన్ తినేవాళ్లూ లేకపోలేదు. ఇక చికెన్ వంటకాల్లో చికెన్ 65కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. స్పైసీగా జ్యూసీగా ఉండే ఈ స్టార్టర్ అంటే అందరికీ ఫెవరెట్. మనం తరచుగా తినే ఈ వంటకానికి చికెన్ 65 అని పేరు ఎందుకు వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక అనేక ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
పేరు వెనుక ఉన్న ప్రధాన కథనాలు
చికెన్ 65 పేరు వెనుక అనేక సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైన కథనాలు ఇక్కడ ఉన్నాయి:
1965లో పుట్టింది
చాలా మంది నమ్మే కథనం ఏమిటంటే.. ఈ వంటకాన్ని 1965వ సంవత్సరంలో చెన్నైలోని ప్రసిద్ధ బుహారీ రెస్టారెంట్‌లో మొదటిసారిగా తయారు చేశారు. అందుకే ఆ సంవత్సరం గుర్తుగా దీనికి చికెన్ 65 అనే పేరు పెట్టారు. ఈ రెస్టారెంట్ గతంలో చికెన్ 78, చికెన్ 82, చికెన్ 90 వంటి వంటకాలను కూడా అందించేది. ఇది తయారీ సంవత్సరాన్ని సూచించేలా పేరు పెట్టారనే వాదనకు బలాన్నిస్తుంది.
65 ముక్కలుగా కట్ చేయడం
మరో కథనం ప్రకారం.. ఈ వంటకాన్ని తయారు చేసేటప్పుడు చికెన్ మొత్తాన్ని 65 చిన్న ముక్కలుగా కత్తిరించి వండుతారు. అందుకే దీనికి చికెన్ 65 అని పేరు వచ్చిందని చెబుతారు.
విచిత్ర వాదనలు
కొన్ని కథనాలు మరింత విచిత్రంగా ఉంటాయి ఈ వంటకం తయారీకి 65 రకాల పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ వంటకాన్ని 65 రోజుల్లో తయారు చేస్తారు. 65 రోజుల వయసున్న కోడిని మాత్రమే ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు అనే వాదనలు ఉన్నాయి.
సైనికుల క్యాంటీన్ మిస్టరీ
చాలా భిన్నంగా ఉండే మరో కథ దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్న ఉత్తర భారత సైనికులకు సంబంధించినది. సైనిక క్యాంటీన్‌లలోని తమిళ మెనూను చదవలేని సైనికులు, వంటకం పేరుకు ఎదురుగా ఉన్న సంఖ్యను చెప్పి ఆర్డర్ చేసేవారు. ఆ జాబితాలో 65వ సంఖ్య ఎదురుగా ఉన్న వంటకమే చికెన్ 65 అని, అందుకే ఆ పేరు స్థిరపడిందని చెబుతారు.
ఈ కథనాల్లో ఏది నిజమైనదో ఖచ్చితంగా చెప్పలేము.. కానీ చికెన్ 65 వెనుక ఇంత చరిత్ర ఉండటం మాత్రం ఈ వంటకాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
మరిన్న హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




