Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bees: అంతరించిపోతున్న తేనెటీగలు..? మానవ మనుగడకు పెనుముప్పు తప్పదంటోన్న సైంటిస్టులు

తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే భూమి మీద ఉన్న జీవులన్నీ కేవలం 30 రోజుల్లో అంతరించిపోయే ప్రమాదం ఉంది. తేనెటీగలు కనుక అంతర్థానం అయితే కేవలం రెండు సంవత్సరాల్లో మనుషులతో సహా జీవులన్నీ..

Bees: అంతరించిపోతున్న తేనెటీగలు..? మానవ మనుగడకు పెనుముప్పు తప్పదంటోన్న సైంటిస్టులు
Role of bees in global food security
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 17, 2023 | 4:19 PM

Importance of bees in global food security and nutrition: పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో జీవవైవిధ్యం పాత్రను కీలకమైనది. పతనమైపోతున్న జీవవైవిధ్యం భూమిని వినాశనం వైపు నడిపిస్తోంది. పెరుగుతున్న జనాభా, అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా అనేక వృక్ష జాతులు, జంతువులు అంతరించిపోతున్నాయి. జీవవైవిధ్యంపై పొంచి ఉన్న ముప్పు మానవ ఉనికికే ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తేనెటీగలు తగ్గుతున్నట్లు శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాలతో వీటి బతుకే గల్లంతవుతోంది. జీవవైవిధ్యానికి తేనెటీగలు ప్రధాన ఆధారభూతాలు. తేనెటీగలే కదా అంతరించిపోతే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారా? భూమిపై మానవుడు ఉత్పత్తి చేస్తున్న పంటల్లో 70 శాతానికి పైగా తేనెటీగల వంటి ‘పాలినేటర్స్‌’ పరా పరాగ సంపర్కం వల్లే పండుతున్నాయి. తేనెటీగలు, తుమ్మెదలు, తూనీగలు.. ఇవన్నీ కూడా పుప్పొడి వాహక కీటకాలు. తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే భూమి మీద ఉన్న జీవులన్నీ కేవలం 30 రోజుల్లో అంతరించిపోయే ప్రమాదం ఉంది. తేనెటీగలు కనుక అంతర్థానం అయితే కేవలం రెండు సంవత్సరాల్లో మనుషులతో సహా జీవులన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ఐన్‌స్టీన్‌ ఏనాడో అన్నాడు. ఇవి అంతరిస్తే ప్రపంచ ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పు వస్తుందని నిపుణులు అంటున్నారు. ఐతే గత కొంతకాలంగా తేనెటీగల సంఖ్య దారుణంగా తగ్గిపోతోంది. గడచిన మూడు నెలల్లో బ్రెజిల్‌లో ఏకంగా 50 కోట్ల తేనెటీగలు నేలరాలిపోవడం యావత్‌ ప్రపంచాన్ని ఆలోచింప జేస్తోంది. అడ్డూఅదుపు లేకుండా వాడుతున్న పురుగుమందుల వల్లనే తేనె టీగలు అంతమవుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు బ్రెజిల్‌లో ఏం జరిగింది..?

బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనోరో వ్యాపారవర్గాల మద్దతుతో అధికారంలోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో వెనుకబాటుతనం నెలకొనడంతో ఎరువులు, రసాయనాల వాడకంపై ఆంక్షలు ఎత్తేశారు. ఫలితంగా వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్లైఫోసెట్‌ను విచ్చలవిడిగా వాడటంతో కోట్ల సంఖ్యలో తేనెటీగలు నేలరాలాయి.

తేనెటీగలు అంతమొందితే ఏం జరుగుతుంది..?

తేనెటీగల సంఖ్య తగ్గితే జరిగే పరిణామాలేంటో చెప్పేందుకు కాలిఫోర్నియా ఘటన ఓ ఉదాహరణ. 2014లో ఆ దేశంలో హఠాత్తుగా బాదంపప్పు దిగుబడి సగానికి సగం పడిపోయింది. బాదం పూలు విరగపూసినా అవి కాయలుగా మారేందుకు స్త్రీ, పురుష బీజకణాల మధ్య పరపరాగ సంపర్కం జరిపే ‘క్యూపిడ్‌’ అంటే తేనెటీగ రాలేదని పరిశోధకుల దృష్టికి వచ్చింది. ‘నియోనికొటినాయిడ్స్‌’ అనే విత్తన శుద్ది రసాయనంతోపాటు పురుగుమందులుగా కూడా వినియోగిస్తుండటంతో ఇతర కీటకాలతోపాటు తేనె కోసం పువ్వుల మీద వాలే తేనెటీగలు కూడా మరణిస్తున్నాయి. ఈ విధమైన విత్తనాల వల్ల అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కెన్యా దేశాల్లో కూడా పంట దిగుబడులు తగ్గడంతో నియోనికొటినాయిడ్స్‌ వాడకంపై ఆంక్షలు, నిషేధాలకు సమాయత్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘పాలినేటర్స్‌’తో పాటు వృక్షజాతుల్లో అధిక శాతం కనిపించకుండా పోతాయి. ఫలితంగా వాటిపై ఆధారపడి జీవించే కీటకాలు, పక్షులు కూడా అంతరిస్తాయి. పక్షులు అంతరించడం వల్ల విత్తనవ్యాప్తి జరగదు. ఇదే జరిగితే మొదట శాకాహార జంతువులు, ఆ తర్వాత మాంసాహార జంతువులు కూడా మృతి చెందుతాయి. వృక్షాలు తగ్గితే వర్షాలూ కనుమరుగై నీరు అడుగంటి పోతుంది. ఆపై మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే రసాయనాలకు బదులు సేంద్రీయ ఎరువులు వాడాలి. పొలాల్లో, ఇంటి పెరట్లో పూల మొక్కలను విస్తృతంగా పెంచాలి. వీటిపై పురుగుమందులు చల్లకుండా ఉంటే మొక్కల మధ్య సంపూర్ణ పరపరాగ సంపర్కం జరుగుతుంది. తద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయి. మనం తేనెటీగలను పెంచి పోషిస్తే, అవి మనల్ని పెంచి పోషిస్తాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.