Video games: మీ పిల్లలు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..
మీ పిల్లలు అదేపనిగా వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అయితే బీకేర్ ఫుల్... చిన్నారులు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. శారీరకంగా ఎలాంటి ఉత్తేజం కలిగించని ఈ సిట్టింగ్ గేమ్స్... తెలియకుండానే ఉపద్రవాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా జరుగుతున్న జరుగుతున్న సంఘటనలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయ్.

పిల్లలు గ్రౌండ్‌లో గెంతులేస్తూ ఆటలాడే రోజులు ఎంత బాగుండేవి…! కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా? అంటే సమాధానం దొరకడం కష్టమే. మానసిక, శారీరక ఉల్లాసం కలిగించే ఆరోగ్యకరమైన ఆ ఆటలూ కనిపించవు. సందు దొరికితే చాలు.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, పిల్లల చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. సోఫాకు అతుక్కుపోయి… గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడే రోజులొచ్చేశాయ్. అయితే, కాలానుగుణంగా వచ్చిన ఈ మార్పులు… చిన్నారులకు ఆరోగ్యపరంగా పెద్ద చిక్కులే తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు బయటికెళ్లి సమయానికి మించి ఆటలాడుతున్నందుకు పెద్దలతో తిట్లు తినేవారు. కానీ, ఇప్పుడు ఇంట్లోకి బయటికెళ్లి ఆడుకోండంటూ అరవాల్సిన రోజులొచ్చాయ్. స్నేహితులతో కలిసి ఆడుకోవడమే మర్చిపోయారు పిల్లలు. టెక్నాలజీ పుణ్యమా అని.. అరచేతిలో స్వర్గం కనిపిస్తుండటంతో… స్మార్ట్ ఫోన్లకు, ల్యాప్‌టాప్‌లకు అడిక్ట్ అయిపోతున్నారు చాలామంది పిల్లలు. అయితే, ఆసక్తి రేపే ఈ గేమ్స్.. అంతకు మించి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. చిన్నారుల గుండెలయను తప్పేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. తాజాగా ఆస్ట్రేలియన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో ఇదే విషయం స్పష్టమైంది.
కూర్చున్న చోటే ఆడుతున్న గేమ్స్ కదా.. వీటితో ఏంటి డేంజర్ అనుకోవడానికి లేదు. ఆట ఏదైనా ఆటే… అందుకే, గెలుపోటములతో భావోద్వేగాలు అదే స్థాయిలో ఉంటాయి. గేమ్ ఓడినా, గెలిచినా… విపరీతంగా ఎగ్జయిట్ అవుతుంటారు పిల్లలు. దీనివల్ల పిల్లల హార్ట్‌బీట్‌లో తేడా వస్తోంది. పర్యవసానంగా… వారి ప్రాణాలే పోతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా హృద్రోగాలున్నట్టు ముందుగా గుర్తించని పిల్లలకు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తాజా అధ్యయనం తేల్చింది. ఇలాంటి పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోతుంటారనీ… అది వాళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది.
గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలకే డేంజర్ అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే, ఎలాంటి కార్డియక్ ప్రాబ్లమ్స్ లేని పిల్లలు కూడా… ఈ వీడియోగేమ్స్ ఆడుతూ హార్ట్‌స్ట్రోక్‌తో చనిపోతున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గేమ్ రిజల్ట్‌తో ఉద్వేగానికి లోనవుతున్న పిల్లలు.. ఒక్కసారిగా హార్ట్‌బీట్‌లో తేడావచ్చి కుప్పకూలుతున్నట్టు తమ స్టడీలో గుర్తించారు. సాధారణంగా హార్ట్ బీట్ కరెక్టుగా లేని పిల్లల్లో… ఈ వీడియో గేమ్స్.. మరింత ప్రమాదానికి కారణమవుతాయనీ హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ఒక్కసారిగా గుండె ఆగిపోయేలా చేస్తాయంటున్నారు. ఆస్ట్రేలియాలోని ది హార్ట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. వీడియో గేమ్స్ ఆడుతూ స్పృహ తప్పిపడిపోయిన పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదనీ… తప్పనిసరిగా వారికి గుండె సంబంధిత పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.
ఈ అంశానికి సంబంధించి హార్ట్ రిథమ్ అనే జర్నల్‌లో ప్రచురితమైన వివరాలు.. సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా కొంతమంది పిల్లల్లో హృదయ స్పందన సరిగ్గా ఉండదు. దాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించరు. అలాంటి పిల్లలు, వీడియో గేమ్స్ ఆడినప్పుడు.. ఉద్వేగంతో హృదయంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది ఫైర్ ఫెయిరీ, బ్లూ వేల్, గాలోన్ చాలెంజ్, చోకింగ్ గేమ్ వంటి వీడియో గేమ్స్‌లో ఆడినప్పుడు.. ఈ తరహా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి సడెన్‌గా హార్ట్‌బీట్ ఆగిపోతుంది. అందుకే, ఈ విషయంలో తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
ఆధునిక ప్రపంచంలో మొబైల్ వీడియో గేమ్స్ పిల్లల ఆరోగ్యంపైనే కాదు… మానసికంగానూ ఎంతటి చెడు ప్రభావాన్ని చూపుతున్నాయనే దానికి… ఇటీవల ఢిల్లీలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ‘ఫ్రీ ఫైర్’ మొబైల్ గేమ్ ఆడటం కోసం ఓ 12 ఏళ్ల పిల్లాడు ఏకంగా తన తల్లిదగ్గర గోల్డ్‌చైన్ కొట్టేసి అమ్మకానికి పెట్టేశాడు. ఆ గేమ్ ఆడాలన్నా.. గెలవాలన్నా.. అందులోని ఆయుధాలను ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనాల్సి ఉంటుంది. దానికోసం తల్లి గోల్డ్‌చైన్‌ను 20వేలకు అమ్మేశాడు. ఆ తర్వాత భయపడిపోయి.. ఇంట్లోంచి పారిపోయాడు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది సాయంతో ఇంటికి చేరిన బాలుడు.. జరిగిందంతా చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా దెబ్బకు ఆ మధ్య చాలారోజులు స్కూళ్లు మూతబడటం… ఆన్‌లైన్ క్లాసుల పేరిట ప్రతీ విద్యార్థి చేతికీ ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. క్లాసుల సంగతేమో గాని, ఎంతో మంది పిల్లలు అందులో గేమ్స్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. దాని పర్యావసానమే ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికైనా పిల్లల విషయంలో అలర్ట్‌గా ఉండకపోతే అనర్థం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..
