AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇల్లే డేంజర్ జోన్! కొత్త స్టడీ షాకింగ్ రిపోర్ట్

చాలా మంది బయటికి వెళితేనే గాలి కాలుష్యం బారినపడతామని అనుకుంటారు. కానీ, కొత్త అధ్యయనం మాత్రం బయటి కంటే ఇంటిలోపలే ఎక్కువ గాలి కాలుష్యం జరుగుతోందని తేల్చింది. ఇందుకు పలు కారకాలను వెల్లడించింది. ఇంట్లోని గాలి నాణ్యతను పెంచుకునేందుకు పలు సూచనలు చేసింది.

మీ ఇల్లే డేంజర్ జోన్! కొత్త స్టడీ షాకింగ్ రిపోర్ట్
Home Pollution
Rajashekher G
|

Updated on: Dec 27, 2025 | 12:12 PM

Share

కాలుష్యం ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. బయటికి వెళితే వాహనాల నుంచి వెలువడే కాలుష్యం గాలి నాణ్యతను దెబ్బతీసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. మరి ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉందామనుకుంటే.. తాజా అధ్యయనం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. బయటి గాలి కంటే సాధారణ ఇళ్లల్లో ఉండే గాలి మరింత కలుషితమైనదని పేర్కొంది. ఇంట్లోని గాలి కంటే బయటి గాలి కొంత మేలని తేల్చింది.

వర్క్ హోం, ఇంటి నుంచే ఆన్లైన్ క్లాసులు వినేవారు, ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపేవారి ఆరోగ్యంపై ఈ కలుషిత గాలి చెడు ప్రభావం చూపుతుందని వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ సైంటిస్టులు యూకేలోని మూడు నివాసాలను ఎంచుకుని లో కాస్ట్ సెన్సార్లను ఉపయోగించి గాలి నాణ్యతను పరిశీలించారు. వారి పరిశోధనలో ఆ ఇళ్లలోని గాలి నాణ్యత కంటే కూడా బయటి గాలి నాణ్యత కంటే మెరుగ్గా ఉందని తేలింది. ఇంట్లోని గాలిలో చాలా రకాల కలుషితాలు ఉన్నాయని పేర్కొంది.

ఇంట్లో కాలుష్య కారకాలు

సాధారణ నివాసాల్లో ప్రజలు వారు చేసే రోజువారీ పనులు, సమీపంలోని రెస్టారెంట్ల నుంచి వచ్చే కలుషితాలు ఊపిరిత్తులను దెబ్బతీస్తాయని అధ్యయనం వెల్లడించింది. బయటి నుంచి వచ్చే దుమ్ముధూళి కూడా ఇంట్లోకి వచ్చి గాలిని కలుషితం చేస్తాయి. వంటలు చేయడం వల్ల కూడా కొంత మేర కలుషితం ఇంట్లోనే ఉండిపోతుంది. శుభ్రపరిచే ఉత్పత్తులు, సెంట్ స్ప్రేలు, గ్రీన్ క్లీనర్లు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతాయి. ఇలాంటి కాలుష్యం అధికమైతే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా రావచ్చు. కిటికీలు మూసివేసి ఉంచినప్పుడు, ఎక్స్‌ట్రాక్ట్ ఫ్యాన్లు లేనప్పుడు కాలుష్య కారకాలు పేరుకుపోయే అవకాశం ఉంది.

ఇంట్లో ఉండేవారి ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందంటే?

ప్రజలు తమ సమయంలో 90 శాతం ఇంట్లోనే గడుపుతున్నారని గ్లోబల్ డేటా వెల్లడిస్తోంది. అంటే వాయు కాలుష్యానికి బయటి కంటే ఇంట్లో ఉండేవారే ఎక్కువ గురవుతున్నారు. ఎక్కువగా నివాసాల్లో ఉండే వృద్ధులు, పిల్లలు ఈ కాలుష్య కారకాలతో ఉబ్బసం, దీర్ఘకాలిక అబ్రస్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి, గుండె జబ్బులు, ఊపరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని పలు హెల్త్ జర్నల్స్ పేర్కొన్నాయి. అయితే, ఇంట్లో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు పలు సూచనలు చేశారు నిపుణులు.

వెంటిలేషన్‌ను మెరుగుపర్చుకోవడం, బయటి గాలు బాగున్నప్పుడు కిటికీలు తెరవడం, వంట చేసేటప్పుడు ఎక్స్ట్రాక్టర్ ఫ్యాన్లను ఉపయోగించడం వల్ల ఇంట్లోని కాలుష్యాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చని బర్మింగ్హామ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. పొగను విడుదల చేసే వాటిని తగ్గించాలని, ధూమపానం ఇంట్లో చేయకూడదన్నారు. అధిక కాలుష్య నగరాల్లో ఉన్నవారు ఇంట్లోని వస్తువులు, పరికరాలను తడిగుడ్డలతో శుభ్రం చేసుకోవాలని యార్క్ వర్సిటీ పరిశోధకులు చెప్పారు. బయట కాలుష్యం ఎక్కువగా సమయంలో కిటికీలను మూసి ఉంచాలని సూచించారు.

ఇంటి లోపల గాలిని బయటి పొగమంచుతో పోలుస్తూ తీవ్రంగా పరిగణించాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. మనదేశంలోని బిట్స్ పిలాని, ఎన్ఐటీ వరంగల్, ఐఐటీ జోధ్‌పూర్ అభివృద్ధి చేసిన కొత్త ఇండోర్ గాలి నాణ్యత ఇండెక్స్ ప్రకారం ఇంటి బయటి గాలి కంటే రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువ కలుషితమవుతాయి. ఇంట్లోని కలుష్యాన్ని తగ్గించుకేనేందుకు తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మెరుగైన వెంటిలేషన్ అవసరమని పేర్కొంది. ఇంట్లో ఎక్కువ సమయం ఉండేవారు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నిపుణుల సూచనలు పాటించాలని స్పష్టం చేసింది.