Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వాన్ని మరిచిన కర్కశ కొడుకు.. జీవిత చరమాంకంలో వృద్ధ దంపతుల ఆపసోపాలు!

కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులపై కనికరం చూపలేదు ఆ కర్కశ కొడుకు. నలుగురు కొడుకులకు ఉన్న ఆస్తిని పంచి పెట్టి, తమ కోసం ఉంచుకున్న భూమిని ఇవ్వటం లేదంటూ వేదించాడు మూడవ కొడుకు. అంతటితో ఆగకుండా వ్యవసాయ భూమి పట్టాలు లాక్కొని వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో నుండి గెంటివేసి తాళం వేసుకున్నాడు.

మానవత్వాన్ని మరిచిన కర్కశ కొడుకు.. జీవిత చరమాంకంలో వృద్ధ దంపతుల ఆపసోపాలు!
Elderly Parents
Follow us
Diwakar P

| Edited By: Balaraju Goud

Updated on: Jun 08, 2025 | 8:39 PM

కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులపై కనికరం చూపలేదు ఆ కర్కశ కొడుకు. నలుగురు కొడుకులకు ఉన్న ఆస్తిని పంచి పెట్టి, తమ కోసం ఉంచుకున్న భూమిని ఇవ్వటం లేదంటూ వేదించాడు మూడవ కొడుకు. అంతటితో ఆగకుండా వ్యవసాయ భూమి పట్టాలు లాక్కొని వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో నుండి గెంటివేసి తాళం వేసుకున్నాడు. బిక్కు బిక్కు మంటూ ఆరుబయటే ఉండిపోయిన ఆ వృద్ధులు.. చివరికి తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన మానవత్వానికి మచ్చలా మారింది

తన పేరున ఉన్న భూమి పంపకాలు చేయకున్నా తన వాటా ఇవ్వాలని, భూమి అమ్ముకుంటానని మూడవ కొడుకు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. చివరికి తల్లిదండ్రులనున ఇంట్లో నుండి గెంటివేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మర్రి భాగవ్వ-రామయ్యలు గ్రామంలో సర్వే నంబర్ 1530 లో 5.04 ఎకరాల భూమి ఉంటే నలుగురు కొడుకులకు ఎకరం చొప్పున పట్టా చేసి, రామయ్య పేరున 1.04 గుంటల భూమి ఉంచుకున్నాడు.

అయితే మూడవ కొడుకు చంద్రం ప్రేమించి పెళ్లి చేసుకుని నిజామాబాదులోనే ఉంటున్నాడు. తల్లిదండ్రుల బాగోగులు కూడా పట్టించుకోవడం లేదు. ఇటీవల నెల రోజుల నుంచి ఇంటి వద్ద ఉన్న చంద్రం ఇంట్లో నుంచి తల్లిదండ్రులను గెంటేసి తాళం వేసుకున్నాడు. ఇంట్లో ఉన్న వృద్ధుల పట్టా పాస్ పుస్తకాలను తీసుకెళ్లాడు. దాంతో కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా, పెద్ద మనుషులకు పట్టా పాసు పుస్తకాలు అప్పగించారు.

రామయ్య పేరున ఉన్న 1.04 ఎకరాల భూమి నలుగురికి సమానంగా పంచి ఇస్తే తన భాగం అమ్ముకుని అప్పులు కట్టుకుంటానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు వాపోయారు. అయితే తాము ఉన్నన్ని రోజులు ఎవరికి పంపకం చేసి ఇవ్వమని, తమను ఎవరు బాగా చూసుకుంటే వారికే ఇస్తామని వారు చెప్తున్నారు. అయితే చంద్రం తన దగ్గర అప్పు తీసుకున్నాడని ఓ వ్యక్తి తన భూమిలో సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వాపోయారు. మిగతా ముగ్గురు కొడుకులు బాగానే ఉన్నారని, మూడో కొడుకు చంద్రం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

భూమి కబ్జా విషయమై వృద్ధ దంపతులు స్థానిక బిక్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కొడుకు చంద్రం, భూమిని అక్రమంగా సాగు చేసిన సుధాకర్‌పై కేసు నమోదు చేసినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. తమ పట్టా పాసు పుస్తకాలు తమకు ఇప్పించి తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..