Minister’s Parents: పలుగు, పార పట్టుకుని కూలీ పనికి వెళ్తున్న కేంద్ర సహాయ మంత్రి తల్లిదండ్రులు.. ఎందుకిలా చేస్తున్నారంటే..?
కేంద్ర సహాయ మంత్రి తల్లిదండ్రులు.. పలుగు, పార పట్టుకుని కూలీ పనికి వెళ్తూ సాదాసీదాగా కాలం వెల్లదీస్తున్నారు.
Union Minister’s Parents working as Labour: ఇవాళ , రేపు చిన్నపాటి గల్లీ లీడర్ అయితేనే.. డాబు, దర్పం ప్రదర్శిస్తుంటారు. వార్డు మెంబర్‌గా ఎన్నికైన వ్యక్తికి పెద్ద బంగ్లా, ఖరీదైన కార్లు, ఇంటి నిండి పనివాళ్లతో రాజసం ప్రదర్శిస్తుంటారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి స్టేటస్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి.. కానీ ఇక్కడ ఓ కేంద్ర సహాయ మంత్రి తల్లిదండ్రులు.. పలుగు, పార పట్టుకుని కూలీ పనికి వెళ్తూ సాదాసీదాగా కాలం వెల్లదీస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
తనయుడు కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కూలి పనులకు వెళ్తున్నారు ఆయన తల్లిదండ్రులు. భారతీ జనతా పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ స్వగ్రామం తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి సమీపంలోని కోనూరు గ్రామం. ఆయన తండ్రి లోకనాథన్ (65), తల్లి వరదమ్మాల్ (60). వీరు మొదటి నుంచి వ్యయసాయ కూలీలు. వీరి కుమారులు మురుగన్, రామస్వామి. తమ రెక్కల కష్టంతోనే కుమారులకు మంచి చదువులు చెప్పించారు.
చిన్న వయసు నుంచే చదువుపై ఆసక్తి ఉన్న మురుగన్ న్యాయవిద్య, ఎంఎల్, పీహెచ్‌డీ పూర్తి చేశాక బీజేపీలో చేరి క్రియాశీలకంగా మారారు. తమిళనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మురుగన్ సతీమణి కలైయరసి చెన్నైలో పిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా ఆయన తల్లిదండ్రులు తమ పనిని కొనసాగిస్తున్నారు. పిల్లలు ఎంత ప్రయోజకులైన వారు మాత్రం తమ వృత్తిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. దీనిపై లోకనాథన్ దంపతులు స్పందిస్తూ.. తనతో కలిసి ఉండాలని, కుమారుడు రమ్మని పిలిచారన్నారు.. కానీ సొంత కష్టంతోనే బతకాలని నిర్ణయించుకుని తాము పనులకు వెళ్తున్నామని వివరించారు.