Success Tips: అందరూ పిచ్చివాడు అన్నా వినలేదు.. చివరకు ప్రపంచాన్ని మార్చేశాడు! ఎవరీ సామ్ ఆల్ట్‌మాన్?
ఏదో చిన్న ఉద్యోగం చేసి సెటిల్ అయిపోదాం అనుకునే వారికి సామ్ ఆల్ట్‌మాన్ సలహాలు పనికిరావు. కానీ, ప్రపంచాన్ని మార్చేయాలి, కోట్లలో సంపాదించాలి అనుకునే వారికి ఇవి 'బ్రహ్మాస్త్రాలు'. వేలమంది స్టార్టప్ వ్యవస్థాపకులను గమనించిన సామ్.. అసలైన సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలను బయటపెట్టారు. అవేంటో తెలిస్తే మీ ఆలోచనా విధానమే మారిపోతుంది. ఆయన కథేంటో తెలుసుకుందాం..

చాట్ జీపీటీ (ChatGPT) సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్ దృష్టిలో విజయం అంటే కేవలం అదృష్టం కాదు.. అది ఒక పక్కా ప్లాన్. మీరు చేసే పనిని వడ్డీలా ఎలా చక్రవడ్డీగా మార్చుకోవాలి? అసలు ఎలోన్ మస్క్ లాంటి వారు ఎలా ఆలోచిస్తారు? ఈ విషయాలపై సామ్ ఇచ్చిన టాప్ 5 టిప్స్ మీకోసం.
మీ కెరీర్‌ను చక్రవడ్డీలా పెంచుకోండి : సామ్ ప్రకారం, సంపద మరియు ప్రభావం పెరగడానికి ‘కాంపౌండింగ్’ ఒక మ్యాజిక్ లాంటిది. రెండేళ్ల అనుభవం ఇరవై ఏళ్ల అనుభవంతో సమానమయ్యేలా ఉండాలి కానీ, ఒకే పనిని ఇరవై ఏళ్లు చేయడం కాదు. నెట్‌వర్క్ ఎఫెక్ట్స్ ఉన్న వ్యాపారాలను ఎంచుకోండి. మీ నైపుణ్యం కాలంతో పాటు పెరుగుతూ వెళ్లాలి.
మీపై మీకు గట్టి నమ్మకం ఉండాలి : అగ్రస్థానంలో ఉండేవారు తమపై తాము దాదాపు ‘పిచ్చి’ అనిపించేంత నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎలోన్ మస్క్ అంగారక గ్రహంపైకి రాకెట్లు పంపుతాను అన్నప్పుడు అందరూ నవ్వారు, కానీ అతని నమ్మకమే అతన్ని గెలిపించింది. విమర్శలను తట్టుకుంటూ మొండిగా ముందుకు వెళ్లేవారే విజేతలవుతారు.
సొంతంగా ఆలోచించండి : స్కూళ్లు మనల్ని అందరిలా ఆలోచించమని నేర్పుతాయి, కానీ వ్యవస్థాపకులకు ‘భిన్నంగా’ ఆలోచించడం తెలియాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మూలాల నుండి విశ్లేషించండి. ఓటమిని అంగీకరిస్తూనే, ఒక్కసారి సరైన నిర్ణయం తీసుకుంటే చాలు అనే పట్టుదలతో ఉండండి.
అమ్మడం నేర్చుకోండి : మీ విజన్ ఎంత గొప్పదైనా, దానిని ఇతరులకు వివరించి ఒప్పించలేకపోతే లాభం లేదు. ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు, కస్టమర్లకు మీ ఐడియాను ‘అమ్మడం’ తెలియాలి. స్పష్టమైన కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం ఈ విషయంలో మీకు ఆయుధాలు.
ముందే రిస్క్ తీసుకోండి : కెరీర్ ప్రారంభంలో రిస్క్ తీసుకోవడం చాలా సులభం. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ ఉండదు, కానీ గెలిస్తే ఆకాశమే హద్దు. సౌకర్యవంతమైన ఉద్యోగాల ఉచ్చులో పడకుండా, చిన్న రిస్క్‌లను తీసుకుంటూ పెద్ద లక్ష్యాల వైపు అడుగులు వేయండి.
