Weather: తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. రాత్రిపూట తగ్గిన చలి తీవ్రత.. హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..?
Weather: గత కొన్ని రోజులుగా చలితో ఇబ్బందిపడిన ప్రజలు ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి.
Weather: గత కొన్ని రోజులుగా చలితో ఇబ్బందిపడిన ప్రజలు ఇప్పుడు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో చలి తక్కువగా ఉంటుంది. అయితే అనూహ్యంగా పగటిపూట ఎండలు కూడా పెరుగుతున్నాయి. దీంతో చలికాలం ముగియకముందే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగింది. గత రెండు రోజులుగా రాత్రివేళలో చలి తీవ్రత తగ్గి.. గాలిలో తేమ శాతం పెరిగినట్లు IMD విభాగం తెలిపింది.
తక్కువ ఎత్తులో వీస్తున్న ఉత్తర-వాయువ్య గాలుల కారణంగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఈ ప్రభావం వల్ల రాత్రిళ్ళు ఉక్కపోతగానూ పగలు ఎండల తీవ్రత అధికంగానూ ఉంటుంది. మరోవైపు మార్చి మొదటివారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని IMD సూచించింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్, జహీరాబాద్ సహా మహారాష్ట్రలోని షోలాపూర్, నాందేడ్ పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగినట్లు వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదు కాగా గరిష్టంగా 33-34 డిగ్రీలకు చేరుకుంది. వాస్తవానికి మార్చి తర్వాత ఉష్ణోగ్రతలలో మార్పు కనిపించేది. చలి తీవ్రత తగ్గి ఎండలు పెరిగేవి. కానీ ఆ ప్రభావం ఇప్పుడు తొందరగా కనిపించడం విశేషం..