Ambani Wedding: కరీంనగర్ కళాకారులకు పెద్ద ఎత్తున అంబానీ ఫ్యామిలీ ఆర్డర్స్.. ఏంటో తెల్సా..?

దేశంలోనే అత్యంత అరుదైన కళ.. దక్షిణాదికే వన్నె తీసుకొస్తున్న కళాకారులు. కరీంనగర్ అనగానే ప్రసిద్దికెక్కిన వాటి సరసన నిలిచేది సిల్వర్ ఫిలిగ్రి. దశాబ్దాలుగా ఈ కళతో అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని ఆర్ట్‌కు జీవం పోస్తూ వచ్చారు.

Ambani Wedding: కరీంనగర్ కళాకారులకు పెద్ద ఎత్తున అంబానీ ఫ్యామిలీ ఆర్డర్స్.. ఏంటో తెల్సా..?
Karimnagar Silver Filigre
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 23, 2024 | 12:58 PM

దేశంలోనే అత్యంత అరుదైన కళ.. దక్షిణాదికే వన్నె తీసుకొస్తున్న కళాకారులు. కరీంనగర్ అనగానే ప్రసిద్దికెక్కిన వాటి సరసన నిలిచేది సిల్వర్ ఫిలిగ్రి. దశాబ్దాలుగా ఈ కళతో అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని ఆర్ట్‌కు జీవం పోస్తూ వచ్చారు. కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తున్న ఈ కళాకృతులను ఆదరించే వారు అంతంత మాత్రమే ఉన్నా ఆర్టిస్టులు మాత్రం వెనకడుగు వేయలేదు.

సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సొసైటీ నేతృత్వంలో వెండితో తయరు చేస్తున్న వివిధ రకాల కళాకృతులను మార్కెటింగ్ చేయడం కోసం ఎదురీదారనే చెప్పాలి. ఇంతకాలం కళను నమ్ముకుంటే కుటుంబ పోషణ కూడా భారం అవుతుందన్న ఆందోళనతో కాలం వెల్లదీసిన ఆ కళాకారులకు గుర్తింపు రావడం మొదలైంది. అత్యంత అరుదైన సిల్వర్ ఫిలిగ్రీకి భవిష్యత్తులో అయినా ఆదరణ లభిస్తుందని ఆశించిన వారి అంచనాలకు తగ్గట్లుగా ఆర్డర్డు వస్తున్నాయి.

జీ 20 సమావేశాలతో..

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ ఉందన్న విషయం తెలిసినప్పటికీ అనుకున్నంత మార్కెటింగ్ మాత్రం లేదు. కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఫిలిగ్రీ కళ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం జీవం పోసినట్టు అయ్యింది. జీ -20 దేశాల సమావేశం భారత్‌లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుండి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపై కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. కోణార్క్ సూర్యదేవాలయంలో ఏర్పాటు చేసిన కాలచక్రం పోలిన బ్యాడ్జెస్ తయారు చేయించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. జీ 20 దేశాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో కరీంనగర్ ఫిలిగ్రీకి కళాకారులకు కూడా అవకాశం లభించింది.

ముఖేష్ అంబానీతో అనుబంధం..

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి అంబానీ ఫ్మామిలీ కూడా వినడంతో దాదాపు ఏడాదిన్నర కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుండి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కరీంనగర్ కళాకారుల చేతిలో రూపు దిద్దుకున్న సిల్వర్ పిలిగ్రీ కళాకృతుల నమూనాలు పంపిస్తున్నామని సిఫ్కో ప్రతినిధి అశోక్ తెలిపారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ ప్రోగ్రాం నుండి కూడా అంబానీ ఫ్యామిలీకి వివిధ మోడల్స్ పంపించామని వివరించారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంచుకున్న కళాకృతులను తయారు చేసి వారికి పంపిస్తున్నామని వివరించారు. వివిధ రకాల ఫిలిగ్రీ వస్తువులు తయారు చేస్తున్నామని కళాకారులూ చెబుతున్నారు. అంబానీ కుటుంబం నుంచి పెళ్లి ఆర్డర్స్ వచ్చాయని తెలిపారు. పెళ్లి వేడుకలకు హాజరు అయ్యే వారికి, ఇవే గిఫ్ట్‌లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి గిఫ్ట్ లు తీసుకెళ్లడం ఆనందంగా ఉందని చెబుతున్నారు..

అనంత్ అంబానీ వెడ్డింగ్ నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఎంచుకున్న డిజైన్లలో తీర్చిదిద్దే పనిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు నిమగ్నం అయ్యారు. సిల్వర్ ఫిలిగ్రీ కళపై ప్రముఖుల దృష్టి పడడంతో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. సిల్వర్ ఫిలిగ్రీ కళకు డిమాండ్ పెరుగుతుండడంతో కళాకారుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. కరీంనగర్ ఖ్యాతి కూడా ఖండంతరాలకు పాకుతోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles