AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tragedy: కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న తండ్రి.. స్మశానవాటికలోనే మృతి, ఇద్దరి మరణంతో తల్లి అస్వస్థత

విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. కొడుకు వెంటే తిరిగిరానిలోకాలకు తండ్రి వెళ్లిపోయాడు.. అటు కొడుకు, ఇటు భర్త మరణం జీర్ణించుకోలేక.. భార్య కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది..

Tragedy: కుమారుడికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న తండ్రి.. స్మశానవాటికలోనే మృతి, ఇద్దరి మరణంతో తల్లి అస్వస్థత
Tragedy
Balaraju Goud
|

Updated on: Feb 13, 2022 | 10:44 AM

Share

Tragedy in Visakhapatnam: కొడుకు జీవితం కోసం కలలు గన్నాడు.. అల్లారుముద్దుగా పెంచి పోషించాడు.. చదివించి ఉద్యోగం వచ్చే స్థితికి చేర్చాడు. అంతలో ఒక్కసారిగా ఆ ఇంట విషాదం. చేతికి అంది వచ్చిన కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు చితి చుట్టూ తిరుగుతూ తండ్రి కుప్పకూలిపోయాడు. కన్నా నీ వెనకే నేను కూడా వస్తున్నా అన్నట్టు తండ్రి కూడా అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇక.. ఒకవైపు చేతికి అందివచ్చిన కన్న కొడుకు.. మరోవైపు కట్టుకున్న భర్త దూరమావడంతో కొడుకును కోల్పోయిన ఆ తల్లి తల్లడిల్లి పోయింది. నరకవేధనను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ హృదయ విదారక ఘటన విశాఖలో జరిగింది. అందరినీ కంటతడి పెట్టించింది.

గుండె నిండా ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు… చదువు పూర్తి చేశాడు.. రేపో మాపో ఉద్యోగం కూడా వచ్చేస్తుంది.. పెళ్లి చేస్తే బాధ్యత కూడా తీరిపోతుంది.. ఇలా ఎన్నో కలలు గన్నాడు ఆ తండ్రి. ఇంతలో ఉన్నట్టుండి కొడుకు ప్రాణాలు విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అనంతలోకాలకు వెళ్లడంతో.. తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. కొడుకు చితి చుట్టూ తిరుగుతున్న ఆ తండ్రి గుండె కూడా ఆగిపోయింది.

విశాఖ నగరంలోని యారాడకు చెందిన అప్పారావు కుటుంబం బతుకుదెరువుకోసం మల్కాపురం వచ్చింది. అప్పారావు ప్రైవేటు సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అప్పారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఓ కుమార్తె పెళ్లి కూడా చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు గిరీష్ చదివించాడు అప్పారావు. గిరీష్ కూడా ఇటీవల ఏవియేషన్ కోర్సు పూర్తిచేశాడు. బాబుకు ఉద్యోగం కూడా వచ్చేస్తుంది . 24 ఏళ్ల గిరిష్ చేతికి అంది రావడంతో.. ఇక తన బాధ్యతలు అందిపుచ్చుకున్నాడు అనుకుంటాడు తండ్రి. ఉద్యోగం వచ్చాక పెళ్లి కూడా చేస్తే తన బాధ్యతలు తీరిపోతాయి అనుకున్నాడు అప్పారావు. మనవడు, మనవరాలు పుడితే శేష జీవితం హ్యాపీగా వారిని ఆడిస్తూ గడిపే అనుకొన్నాడు అప్పారావు.

ఇంతలో ఆ కుటుంబం కోసం కలలుగన్న అప్పారావుకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు గిరీష్.. అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక గొల్లలపాలెం శ్మశానవాటికకు గిరీష్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. గిరీష్ మృతదేహాన్ని చితిపై పెట్టారు. చితి చుట్టూ తండ్రి అప్పారావు తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరూ తేరుకునేలోపే కొడుకు చితి దగ్గరే ప్రాణాలు విడిచాడు తండ్రి. ఐదేళ్ల కిందట అప్పారావుకు గుండె సంబంధిత వ్యాధి రావడంతో స్టెంట్ వేశారు. కొడుకు మరణంతో షాక్ కు గురైన తండ్రి అప్పారావు కుప్పకూలిపోయాడు. అప్పటికే కన్న కొడుకు తమను విడిచి వెళ్లడం ఏ తీవ్ర శోకంలో ఉన్న తల్లి.. భర్త కూడా కుప్పకూలి పోయాడు అని తెలిసి తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. అప్పారావు మృతదేహానికి కొడుకు అంత్యక్రియలు చేసిన స్మశాన వాటిక లోనే అంత్యక్రియలు చేశారు.

భర్తను కొడుకును ఒకేసారి కోల్పోయిన ఆ భార్య.. తన కుమారులతో కలిసి విలపిస్తున్న తీరు చూస్తే అందరినీ కలచివేసింది. కంటతడి పెట్టించింది. పగవాడి కైనా ఇటువంటి పరిస్థితి రాకూడదని అంటున్నారు స్థానికులు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also…. Elephant Funny Video: చిర్రెత్తిన ఏనుగు ఏం చేసిందో తెలుసా..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..