Gold Man in Tirumala: మీ ఒళ్లు బంగారం కానూ.. బంగారంతా వీళ్ళ దగ్గరే ఉన్నట్లుంది..!
మీ ఒళ్లు బంగారం కానూ.. వాళ్లను చూస్తే మీరు ఇదే అంటారు. ఎందుకంటే అర తులం కొనాలంటేనే అపసోపాలు పడుతున్న జనం.. ఆ ఇద్దరి ఒంటిపై నిలువెత్తు బంగారం చూసి అసూయ పడుతున్నారు. పది వేళ్లకు ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు గడియారాలను చూసి నోరెళ్లబెడుతున్నారు. మెడలో వేలాడుతున్న భారీ స్వర్ణాభరణాలు చూసి అదృష్టమంటే మీదేనంటూ నిట్టూరుస్తున్నారు.
తిరుమలలో రెండ్రోజులుగా గోల్డ్ మెన్స్ సందడి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ చెందిన బంగారు బాబు విజయ్ కుమార్ సందడి చేస్తే.. తాజాగా కర్నాటకకు చెందిన మరో గోల్డ్ మెన్ తిరుమలలో కనిపించారు. ఆయన ఒంటినిండా.. ఏకంగా ఐదు కేజీల బంగారం వేసుకుని శ్రీవారి దర్శనానికి వచ్చాడు. పెద్ద చైన్లు, కంఠాభరణాలు ధరించారు. భారీ బంగారు ఆభరణాలు వేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు..
మహిళల అలంకరణలో బంగారు ఆభరణాలు, పూలు రెండూ కీలకమే. బంగారు నగలు లేకపోయినా పూలు పెట్టుకోవడం మహిళలకు ఎంతో ఇష్టం. అయితే తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు కొండపై పూలు కూడా పెట్టుకోకూడదని భావిస్తారు. బంగారు ఆభరణాలు మాత్రం అలంకరించుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే వాళ్లని మించి మోయలేనంత బంగారు ఆభరణాలు ధరిస్తున్న మగవాళ్ళు ఇప్పుడు తిరుమలలో సందడి చేస్తున్నారు. ఒళ్లంతా బంగారుతో దర్శనం ఇస్తున్నారు. కొత్త సంవత్సరం శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తున్న భక్తుల్లో కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి తిరుమలలో తళుక్కు మంటున్న భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇలా నూతన సంవత్సరం తొలిరోజు తిరుమలేశుడి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు బంగారు బాబులు హల్‌చల్ చేశారు. శ్రీవారి ఆలయంలో దర్శనానికి వెళ్లే భక్తులను, ఆలయం ముందున్న భక్తులకు, అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. న్యూ ఇయర్ మొదటి రోజు ఒళ్ళంతా బంగారుతో శ్రీవారి దర్శానానికి వచ్చిన బెంగళూరుకు చెందిన రవి, హైదరాబాద్ కు చెందిన విజయకుమార్ లు ఒక్కొక్కరు 5 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు ధరించారు.
రవి, విజయ్ కుమార్ మెడ, చేతుల నిండుగా బంగారు ఆభరణాలను ధరించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇద్దరినీ ఆసక్తిగా గమనించిన భక్తులు శ్రీవారి ఆలయం ముందు వాళ్ళతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అలంకార ప్రియుడు వెంకన్న ఆలయంలో వీళ్ళిద్దరూ దండలు మాదిరిగా ఉన్న బంగారు హారాలను ధరించి మరింత అలంకరణతో భక్తులను ఆకట్టుకున్నారు. మరోవైపు, బంగారం కొనలేకపోయినా.. నిలువెల్లా బంగారం దిగేసుకున్న వారితో ఫొటోలు దిగుతూ సంతోషపడుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..