Telangana: పేద కుటుంబంలో పుట్టి సైంటిస్ట్‌గా ఎదిగిన యువతి.. జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్..!

పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి.. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. పట్టుదలతో చదివి సైంటిస్ట్‌గా ఎంపికైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికైన శ్రీలత, తాను బీఎస్సీ చదువుకున్న అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీ లోనే పాఠాలు బోధిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూనే, అగ్రికల్చర్ సైంటిస్ట్ రెక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్ఆర్బీ) పరీక్షలో సత్తా చాటింది.

Telangana: పేద కుటుంబంలో పుట్టి సైంటిస్ట్‌గా ఎదిగిన యువతి.. జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్..!
Young Scientist
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Jan 02, 2025 | 11:37 AM

ఆమె లక్ష్యానికి పేదరికం అడ్డురాలేదు.. మారుమూల పల్లెటూరు, పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్టాలు ఎదుర్కొని.. పట్టుదలతో చదివింది. జాతీయ స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది.

పేద కుటుంబంలో జన్మించిన పోలేపొంగు శ్రీలత ఐసీఏఆర్ – ఏఆర్ఎస్ 2023 నోటిఫికేషన్‌లో ఆల్ఇండియా ఐదో ర్యాంకు సాధించింది. ఓపెన్ క్యాటగిరి లో ఏఆర్ఎస్ సైంటిస్ట్‌గా సెలెక్ట్ అయ్యింది శ్రీలత. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచింది.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సుబ్లేడు గ్రామానికి చెందిన పోలపొంగు శ్రీలత అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈమేరకు ప్లాంట్ పాథాలజీ(మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగం ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఐదో ర్యాంకు సాధించింది. దీంతో జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐకార్) లో శాస్త్రవేత్తగా అవకాశం దక్కించుకుంది.

సుబ్లేడుకు చెందిన పోలెపొంగు జగ్గయ్య – కృష్ణకుమారికి కుమార్తె శ్రీలతతో పాటు కుమారుడు లక్ష్మణరావు ఉన్నారు. శ్రీలత సుబ్లేడులోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వరకు, ఐదు నుండి 10వ తరగతి వరకు వైరా ఎస్సీ బాలికల హాస్టల్‌లో చదివింది. ఆతర్వాత ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో, బీఎస్సీ అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేసింది. మహారాష్ట్రలో ఎమ్మెస్సీ(ప్లాంట్ పాథాలజీ) పూర్తి చేశాక, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల పిహెచ్‌డి(PHD) పట్టా అందుకుంది. ఆపై అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికై, తాను బీఎస్సీ చదువుకున్న అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీ లోనే పాఠాలు బోధిస్తోంది.

తొలి ప్రయత్నంలోనే..!

ఓ పక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూనే, శ్రీలత అగ్రికల్చర్ సైంటిస్ట్ రెక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్ఆర్బీ) నిర్వహించే పరీక్షకు సిద్ధమైంది. ఈమేరకు తొలి ప్రయత్నంలో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించింది. తద్వారా మొక్కలపై పరిశోధన కోసం శాస్త్రవేత్తగా ఎంపిక కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. వచ్చే నెలలో ఐకార్‌లో శాస్త్రవేత్తగా కొద్ది రోజుల్లో ఆమె పోస్టింగ్ అందుకోబోతున్నారు. మొక్కల వ్యాధి నివారణ, తక్కువ ఖర్చుతో రసాయన, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి అధిక, ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించేలా పరిశోధనలు చేయాలన్నదే తన లక్ష్యమని శ్రీలత వెల్లడించింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు శ్రీలతను అభినందించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..