AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిడుగు పడటాన్ని ముందే గుర్తించవచ్చా..! అసలు పిడుగు అంటే ఏమిటీ.. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి..

Thunder : వర్షాకాలం వచ్చిందంటే చాలు పిడుగులు పడి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరుగుతాయి. సాధారణంగా పిడుగు అనేది వర్షం

పిడుగు పడటాన్ని ముందే గుర్తించవచ్చా..! అసలు పిడుగు అంటే ఏమిటీ.. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి..
Thunder
uppula Raju
|

Updated on: Jul 08, 2021 | 1:20 AM

Share

Thunder : వర్షాకాలం వచ్చిందంటే చాలు పిడుగులు పడి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరుగుతాయి. సాధారణంగా పిడుగు అనేది వర్షం కురుస్తున్నప్పుడు పడుతుంది. పిడుగు పాటు కార‌ణంగా దేశంలో ఏటా దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మూగ జీవాలు కూడా చ‌నిపోతున్నాయి. పిడుగులు ఎప్పుడు, ఎక్కడ ప‌డ‌తాయో ముందే అంచ‌నా వేయ‌డంతో పాటు, ప్రజ‌లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ఆ సమయంలో సముద్రంలో నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే దట్టమైన క్యూములోనింబస్‌ మేఘాలు కమ్ముకుంటాయి. అప్పుడే ఉరుములు ప్రారంభమవుతాయి. పిడుగులు పడుతుంటాయి.

పిడుగు అంటే ఏమిటి? అవి ఎలా పుడ‌తాయి? ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి వస్తాయి. సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే ‘పిడుగు పడటం’ అంటారు అలా మేఘాల నుంచి పడే ‘పిడుగు’లో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది.

పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం తీసుకుంటోంది. 2017లో ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు.

పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎలా? ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిది. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి. చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు. సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు. ఉరుములు, మెరుపులు, గాలీవాన సమయంలో బైక్‌లు నడపరాదు. ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది.

ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి. ఉరుముల సమయంలో ఇళ్లలో ఉన్న వారు తలుపులు, కిటికీలు మూసివేయాలి. ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రకృతి విపత్తుల నష్టం కింద ప్రభుత్వం 4 లక్షల పరిహారం అందిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇదే తరహా పరిహారం అమలవుతోంది.

Nishith Pramanik : మోదీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కుడు..! ప్రైమరీ టీచర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు అతడి ప్రయాణం..

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్ల ఆహ్వానం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Cabinet Expansion 2021: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి..