Koala Facts: ఎలుగుబంటి కాదు.. ఈ చిత్రమైన జీవులకు ఉండే ఆశ్చర్యకరమైన అలవాట్లివి..
చూడటానికి బొమ్మలా ఉండే కోలా జంతువులకు ఎంతో ప్రత్యేకత ఉంది. చాలామంది వీటిని ఎలుగుబంతులుగా అనుకుంటారు. కానీ అవి నిజానికి ఎలుగుబంట్లు కాదు. వాటి పేరు 'కోలా' ఒక అబోరిజినల్ భాష నుండి వచ్చింది, ఆ భాషలో దానికి 'నీళ్లు తాగనిది' అని అర్థం. వాటికి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన లక్షణాలు, అలవాట్లు తెలుసుకుందాం.

కోలాలు మార్సుపియల్స్ అనే జాతికి చెందినవి. కంగారూలు, వొంబాట్‌లు, పాసమ్‌లకు ఇవి దగ్గర బంధువులు. ప్రపంచంలో కోలా జాతిలో ఒకటే ప్రాణి ఉంది. వీటికి మనుషులకు ఉన్నట్లే వేలిముద్రలు ఉంటాయి. మైక్రోస్కోపులో చూసినా మనుషుల వేలిముద్రలను కోలా వేలిముద్రలను వేరు చేయలేనంతగా ఇవి ఒకేలా ఉంటాయి. కోలాలకు పొడవైన, వాటమైన గోర్లు, అలాగే వస్తువులను పట్టుకోవడానికి వీలుగా ఉండే బొటనవేళ్ళు కూడా ఉంటాయి. ఇవి చెట్లు ఎక్కడానికి సహాయం చేస్తాయి.
ఇవి ఎక్కువగా రాత్రి వేళల్లో చురుకుగా ఉంటాయి. ఒక చెట్టు నుండి మరో చెట్టుకు వెళ్లేటప్పుడు మాత్రమే అవి నేలకు దిగుతాయి. వాటి బొచ్చు చాలా దట్టంగా ఉంటుంది, ఇది వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతుంది. అలాగే ఇది వర్షపు నీటి నుండి కూడా వాటిని కాపాడుతుంది. కోలాలకు ప్రత్యేకంగా ఉండే ఒక గుణం వాటి శరీర వాసన. ఆడ కోలాలు, పిల్ల కోలాలకు యూకలిప్టస్ ఆకుల వాసన వస్తుంది. ఇది ఒక రకమైన కీటక నిరోధకంగా పనిచేస్తుంది. మగ కోలాలకు మాత్రం కస్తూరి లాంటి బలమైన వాసన ఉంటుంది.
వింతైన ఆహారం, జీవనశైలి కోలాల ఆహారం కేవలం యూకలిప్టస్ ఆకులు మాత్రమే. ఈ ఆకులు చాలా జంతువులకు విషపూరితమైనవి, కానీ కోలా జీర్ణవ్యవస్థ వాటిని సురక్షితంగా జీర్ణం చేసుకుంటుంది. తక్కువ పోషకాలు ఉండే ఈ ఆకుల వల్ల, కోలాలు చాలా నిదానంగా కదులుతాయి. అవి రోజుకు దాదాపు 20 గంటలు నిద్రపోతాయి. కోలాలు గుంపులు లేకుండా ఒంటరిగా జీవిస్తాయి. ఇవి బిగ్గరగా అరిచి, గుసగుసలాడి, తమ వాసనల ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి.
కోలా పిల్లలను ‘జోయీ’ అంటారు. అవి పుట్టినప్పుడు ఒక వేరుశనగ గింజంత చిన్నగా, కళ్ళు మూసుకుని ఉంటాయి. జోయీ తల్లి పొట్టలో ఉండే సంచిలోకి పాకుతుంది. అక్కడ అది ఆరు నెలలపాటు పెరుగుతుంది. తర్వాత యూకలిప్టస్ ఆకులను తినే ముందు, అది తన తల్లి మల ద్వారం నుండి వచ్చే ‘పాప్’ అనే అరగబడిన యూకలిప్టస్ గుజ్జును తింటుంది. ఇది వాటి జీర్ణవ్యవస్థను ఆకులను జీర్ణం చేసుకోవడానికి సిద్ధం చేస్తుంది.
కోలాల సంరక్షణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ అందమైన జీవులు ఇప్పుడు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అడవుల నిర్మూలన, కుక్కల దాడులు, వాహనాల ఢీ కొనడం వంటి వాటివల్ల కోలాస్ ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటి నివాసాలను కాపాడితేనే ఈ జీవులు మనుగడ సాగించగలుగుతాయి.




