2021 మానవాళికి గడ్డుకాలమేనా?.. మరిన్ని విపత్తులు తప్పవా?.. బాబా వాంగ చెప్పింది నిజమవుతుందా?..
జ్యోతీష్యం.. భవిష్యత్‌లో ఏం జరుగబోతుందో ముందే చెప్పగలగడం. రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించగలగడం.

జ్యోతీష్యం.. భవిష్యత్‌లో ఏం జరుగబోతుందో ముందే చెప్పగలగడం. రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించగలగడం. ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్యాన్ని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మరు. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కొందరు ప్రముఖులు, జ్యోతిష్కులు చెప్పిన ఎన్నో విషయాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి. మరికొన్ని భవిష్యత్‌లో జరగబోయేవీ ఉన్నాయి. అలా భవిష్యత్‌ను ఊహించి చెప్పిన వారిలో మన వరకు.. మన తెలుగు వ్యక్తి అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే తెలుసు. కానీ, ఆయన లాంటి వాళ్లు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే బల్గేరియాకు చెందిన కంటి చూపు లేని బాబా వాంగ పన్డేవా. భవిష్యవాణికి సంబంధించి ఈవిడ చెప్పిన చాలా వరకు పరిణామాలు వాస్తవ రూపం దాల్చాయి. అందులో కరోనా మహమ్మారి కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఆమె జోస్యం మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. 2020 సంవత్సరంలో అతలాకుతలం అయిన జన జీవనం.. 2021లో మరింత అస్తవ్యస్తంగా మారనుందని బాబా వాంగ అప్పట్లోనే ప్రకటించారు. ప్రస్తుతం ఆమె జీవించి లేకపోయినప్పటికీ ఆమె జోస్యం మాత్రం ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ బాబా వాంగ ఎవరు? ఆమె ఏ దేశానికి చెందిన వారు..? ఆమె 2021 గురించి చెప్పిన జోస్యం ఏంటి? ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.
ఈ బాబా వాంగ ఎవరు..? బల్గేరియాలోని పెట్రిచ్‌లో 1911, జనవరి 31న జన్మించిన బాబా వాంగ.. 1996 ఆగస్టు 11న పరమపదించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయిన వాంగా.. ప్రాణాలతో బయటపడ్డారు. అయితే కళ్లలో ఇసుక పడటంతో ఆమె చూపు కోల్పోయారు. అయితే ఒకరోజు తన తండ్రి సాకుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న వాంగ.. దొంగల వివరాలను, ఆ గొర్ర ఉన్న చోటును పూసగుచ్చినట్లు వెల్లడించింది వాంగ. అలా తన 16 ఏట నుంచి వాంగ భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. 30 ఏళ్ల నాటికి ఆమె శక్తులు మరింత బలీయమయ్యాయి. ఆమె మాటలను బల్గేరియా వాసులు పూర్తిగా విశ్వసించేవారు. ఎన్నో జోస్యాలు నిజం కావడంతో ప్రజలు వాంగను ‘నోస్ట్రడామస్ ఆఫ్ ద బాల్కన్స్’గా పిలవడం మొదలుపెట్టారు. జర్మనీ నియంత హిట్లర్ సైతం ఓసారి పన్డేవాను పిలిచారనే ప్రచారం ఉంది. దాంతో ఆందోళన చెందిన ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయారని బల్గెరియాలో ప్రచారం. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు కొన్ని సంఘటనలను ముందే ఊహించి వాంగ.. అలా ఇంటి నుంచి వెళ్లిపోయారట. అంతేకాదు. అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను కూల్చేస్తారని 1989లో వాంగ చెప్పారు. చివరకు అదేజరిగింది. ఇక 2016లో యూరప్‌పై ముస్లింల దాడికి గురించి వాంగ 1996కు ముందే చెప్పారు. ఈ దాడి యుద్ధానికి దారి తీసి చాలా మంది మృత్యువాత పడతారన్న వాంగ పన్డేవా అప్పట్లోనే ప్రకటించారు. ఆమె నాడు చెప్పిన అంశం 2016లో యధావిధంగా జరిగింది. ఇక సిరియాలో ‘గ్రేట్ ఇస్లామిక్ వార్’ మొదలై 2043 నాటికి రోమ్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని వాంగ తెలిపారు. 2018 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి చైనా శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. కాగా, వాంగ చెప్పిన జోస్యాల్లో అన్నింటికి అన్నీ జరగలేదు కానీ.. 68శాతం వరకు నిజం అయ్యాయని పలువురు వాదిస్తుంటారు. అయితే, 2021 గురించి వాంగ ఏం చెప్పారో చూద్దాం..
2021కి సంబంధించి వంగ బాబా అంచనాలు..
- 2021లో డ్రాగన్ (చైనా) ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. దానికి వ్యతిరేకంగా మూడు భారీ దేశాలు ఒక్కటవుతాయి.
- 2021లో చాలా వినాశకాలు జరుగుతాయి. విపరీతమైన ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి.
- 2021లో క్యాన్సర్‌కి మందును కనుక్కుంటారు.
బాబా వాంగ పన్డేవా చెప్పిన జోస్యాల్లో ఇప్పటి వరకు నిజమైనవి కొన్ని..
- అమెరికా అధ్యక్షుడు కెన్నడీ, భారత ప్రధానులు ఇందిర, రాజీవ్ హత్యల గురించి ప్రస్తావన.
- లోహ విహంగాల దాడితో అమెరికా సోదరులు (ట్విన్ టవర్స్) కూలుతారు. పొద(అప్పటి అధ్యక్షుడు ‘బుష్’ను ఉద్దేశించి)లో తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం పారుతుంది. 2001, సెప్టెంబరు 11న ట్విన్‌టవర్స్ కూల్చివేత గురించి 1989లోనే చెప్పిన వాంగ.
- ఓ పెద్ద అల తీరాన్ని కమ్మేస్తుంది. గ్రామాలు, ప్రజలు జలసమాధి అవుతారు. 2004లో థాయిలాండ్ తీరంలో సునామీ గురించి జోస్యం చెప్పిన వాంగ.
- ఆగస్టు 1999 లేదా 2000లో కురుస్క్ నీటిలో మునిగిపోతుంది.. ప్రపంచం కలవరానికి గురవుతుందని 1980లో చెప్పిన వాంగ. 2000 ఆగస్టులో రష్యాకు చెందిన ‘కురుస్క్’ అణు జలాంతర్గామికి సముద్రంలో ప్రమాదం సంభవించగా.. ప్రపంచ దేశాలు వణికిపోయాయి.
- బల్గేరియా రాజు బోరిస్-3 ఆగస్టు 28, 1943న చనిపోతారని చెప్పగా.. 1944 ఆగస్టు 28న బోరిస్ చనిపోయారు.
బాబా వాంగ పన్డేవా చెప్పిన భవిష్యత్ జోస్యాలు..
- 5079లో ఈ విశ్వం అంతమవుతుంది.
- 3797 నాటికి భూమిపై మనిషి జాతి ఉండదు.
- 2018లో శుక్రుడిపై కొత్త ఇంధనం కనుగొంటారు.
- ప్రపంచంలో మళ్లీ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుంది.
- డొనాల్డ్ ట్రంప్ 2020లో మృత్యువు అంచుల దాకా వెళ్తారు. ఆమె చెప్పినట్లే ట్రంప్‌కి కరోనా వైరస్ సోకింది.
- 2023లో భూమి కక్ష్య మారుతుంది. దీనివల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్రాలు పొంగుతాయి.
- సిరియాలో మొదలయ్యే ఇస్లామిక్ వార్ 2043లో రోమ్‌ను స్వాధీనం చేసుకోవడంతో ముగుస్తుంది. ఈ సందర్భంలో యూరప్ ప్రజలంతా మృత్యువాత పడతారు.
- 2130లో నీటిలో నివసించేలా గ్రహాంతరవాసులు మనుషులకు సాయం చేస్తారు.
- 3005లో అంగారకుడిపై యుద్ధం జరుగుతుంది.
- చంద్రుడిని తోకచుక్క ఢీకొంటుంది.
- భూమి చుట్టూ రాళ్లు, బూడిద వలయం ఏర్పడుతుంది.
ఇదంతా ఇలా ఉండగా బాబా వాంగ పన్డేవా చెప్పిన ఏ విషయమూ రాతపూర్వకంగా లేవు. దాంతో ఆమె చెప్పిన వాటిలో చాలా వరకూ కల్పించినవే అనే చర్చ జరుగుతోంది. ఏదైనా జరిగితే చాలు బాబా వాంగ ముందే చెప్పారని అసత్య ప్రచారం చేస్తున్నారనే వాదనా బలంగా వినిపిస్తోంది.
