Animals Bath: రాజభోగమంటే ఇదేనేమో.. ద్వారకా తిరుమలలో అశ్వాలు, గజరాజులకు షవర్ బాత్
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకునేందుకు ఏసీలు, కూలర్లను వదిలి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.
Animals Shower Bath: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకునేందుకు ఏసీలు, కూలర్లను వదిలి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇంటి నుంచి బయటకొస్తే చాలు మాడు పగిలిపోతోంది. అర్జెంట్ పని ఉంటే తప్ప జనాలు ఇంటినుంచి బయటకు రావలడం లేదు. అయితే ఉష్ణోగ్రతలు మనుషులకే కాక మూగజీవాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అయితే వీటికి ఎండ వేడిని నుంచి కాపా డే చర్యలు చేపట్టింది ద్వారకా తిరుమల దేవస్థానం.
మూగజీవాలు ఎండ వేడిని తగ్గించే విధంగా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై కొలువైన చిన వెంకన్న ఆలయ అధికారులు గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా మూగజీవాలను సంరక్షిస్తున్నారు. గో సంరక్షణ కేంద్రంలో వివిధ జాతుల ఆవులు, గిత్తలు, అదేవిధంగా స్వామివారి సేవకు వినియోగించేందుకు ఆలయ గజలక్ష్మి ఏనుగు, అశ్వాలను పోషిస్తున్నారు. అయితే, వాటికి వేసవి తాపం తగలకుండా ఉండే విధంగా ప్రత్యేక షవర్లు ఏర్పాటు చేశారు.
ఆలయ గజలక్ష్మి ఏనుగు ఆ షవర్ల కింద జల్లు స్నానం చేస్తూ హాయిగా నృత్యం చేస్తూ సేద తీరుతుంది. అంతేకాక ఆలయ అశ్వాలు, ఆవుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షవర్ల వద్ద వాటికి జల్లు స్నానం చేయిస్తున్నారు. దీంతో మూగజీవాలు అధిక ఉష్ణోగ్రతల బారినపడకుండా దేవస్థానం అధికారులు చేపట్టిన చర్యలపై పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపం నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో.. అటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్ వెదర్‌లో సేదదీరుతున్న జంతువులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.— బి.రవి కుమార్, టీవీ9 తెలుగు ప్రతినిధి, పశ్చిమగోదావరి జిల్లా.