AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళవాసులదే అగ్రస్థానం.. అక్కడ మూడు సంస్థల్లోని బంగారం నిల్వలుచాలా ధ‌నిక దేశాల కంటే అధికమట

దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక గోవా రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న గోవా కంటే కేరళ కొనుగోళ్లు ఆరురెట్లు అధికం కావడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారి కంటే..

దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళవాసులదే అగ్రస్థానం.. అక్కడ మూడు సంస్థల్లోని బంగారం నిల్వలుచాలా ధ‌నిక దేశాల కంటే అధికమట
Surya Kala
|

Updated on: Feb 05, 2021 | 8:34 AM

Share

Gold Holdings of 3 Kerala Companies: మ‌న దేశంలో మ‌హిళ‌లకు బంగారం మీద ఉండే మోజు అంతా ఇంతా కాదు. భారతీయులు బంగారంపై మోజు పెంచుకోవడానికి చారిత్రక, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. మన సంస్కృతిలో బంగారాన్ని సంపదకు, హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం ధరించడానికి ఆసక్తి కనబరుస్తారు. వివాహ సందర్భంగా బంగారం నగలు కొనడం భారత్ లో పరిపాటి. దీంతో పెళ్లిళ్ల సీజన్ లో డిమాండ్ ఆకాశాన్నంటుతుంది. వివిధ పండుగలకు, పర్వదినాలకు బంగారం కొనడాన్ని శుభసూచకంగా భావిస్తారు. భారత్ లో బంగారం నగదుతో సమానంగా చలామణి అవుతుంది. కష్టకాలంలో బంగారం విక్రయించుకుంటే తక్షణమే నగదు చేతికొస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. నల్లధనం నిల్వ చేయడానికి బంగారం అనువైన మార్గంగా భావిస్తారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో బంగారం నిల్వ చేస్తారు. దీనిని అవసరమైనప్పుడు మార్కెట్లో విక్రయించి నగదుగా మార్చేస్తుంటారు.

దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక గోవా రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న గోవా కంటే కేరళ కొనుగోళ్లు ఆరురెట్లు అధికం కావడం గమనార్హం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారి కంటే పట్టణ ప్రాంతాల వారు నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సిక్కింలో అత్యల్పంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కేరళలో బంగారు గనులు లేకపోయినప్పటికీ బంగారం అధికంగా ఉండటానికి కారణం సుగంధద్రవ్యాల వ్యాపారం. రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచే మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఐరోపా ఖండాలతో వాణిజ్యసంబంధాలుండేవి. అప్పట్లో కరెన్సీ లేకపోవడంతో వస్తుమార్పిడి పద్ధతి ఉండేది. దీంతో పాటు ఐరోపాలో శీతకాలం సుదీర్ఘంగా ఉండేది. ఐరోపాలో ఆహారపదార్థాలను నిల్వ చేసుకునేందుకు మిరియాలను వినియోగించేవారు. మిరియాలను మలబారు తీరం నుంచి దిగుమతి చేసుకునేవారు. సుగంధద్రవ్యాల కొనుగోళ్లకు బంగారు నాణేలనిచ్చేవారు. ఈ వాణిజ్యంతో కేరళ తీరంలోని పలు నౌకాశ్రయ నగరాలు అభివృద్ధి చెందాయి. ప్రజలు బంగారాన్ని ఒక అలంకారంగా కాకుండా ఆస్తిగా పరిగణించేవారు. దీంతో బంగారును సేకరించేవారు. ఇదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుండటంతో బంగారు వాణిజ్యంలో కేరళ టాప్ గా నిలిచింది.

ఒకప్పుడు సంప్రదాయ వ్యాపారుల‌కే ప‌రిమిత‌మైన బంగారు వ్యాపారం ఒక పరిశ్రమగా రూపుదిద్దుకుంది. ప్రభుత్వ అనుమ‌తులు పొంది బంగారం వ్యాపారం చేస్తున్న సంస్థలు 1950 త‌ర్వాత ఎన్నో వ‌చ్చాయి. ఇలా ఇండియాలోని ఓ మూడు ప్రైవేట్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థల్లోని బంగారు నిల్వలు సింగ‌పూర్‌, స్వీడ‌న్, ఆస్ట్రేలియా , కువైట్‌, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌ దేశాల పసిడి నిల్వల కంటే ఎక్కువట. ప్రపంచంలోని బంగారం మొత్తం డిమాండ్ లో 30 శాతం ఇండియానే ఆక్రమిస్తుంది. ఇకపోతే కేరళకు చెందిన గోల్డ్ లోన్ సంస్థలు ముథూట్, మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్ కార్ప్ దగ్గర సుమారు 263 టన్నుల బంగారం ఉందట.

మలయాళీల ముఖ్యమైన పండగ ఓనం సమయంలో గోల్డ్ ప్రాముఖ్యత ఎనలేనిది. కేరళ ప్రజలకు ఓనం అతి ముఖ్యమైన పండగ. ఈ పండగ రోజున చాలామంది తమకు లేదా తమ ప్రియమైనవారికి బంగారం కొనుగోలు చేయడంలో బిజీగా ఉంటారు. గోల్డ్ రాష్ట్రం యొక్క సంస్కృతికి మూలాలను కలిగి ఉంది. గోల్డ్ ను సంపదకు గొప్ప చిహ్నంగా భావిస్తారు. ఓనం సమయంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా వారి జీవితాల్లో అదృష్టం తో పాటు ఆనందాన్ని తెస్తుందని కేరళ ప్రజలు విశ్వసిస్తారు. దీంతో బంగారు నాణేలను పిల్లలకు, పెద్దలు బహుమతిగా ఇస్తారు. మహిళలు బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. బంగారం మంచి అధృష్టం, సంపద చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో బంగారంను కొనుగోలు చేస్తారు.

Also Read:

బంగారం బాటలో నడిచిన వెండి.. మరి కిలో వెండి ఎంతో తెలుసా..!

వరసగా నాలుగో రోజు దిగివచ్చిన పసిడి.. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధర ఎలా ఉందంటే..