AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి

మన మెదడు శరీరంలో అత్యంత కీలకమైన భాగం. మన ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలు, మనం తీసుకునే నిర్ణయాలన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజు మనం చేసే పనులు, తీసుకునే సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి విషయాలు మెదడు ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
Healthy Brain
Prashanthi V
|

Updated on: Apr 29, 2025 | 12:23 PM

Share

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటి. ఇది మన ఆలోచనలు, గుర్తుంచుకునే శక్తి, నిర్ణయాలు, భావోద్వేగాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మనం ప్రతిరోజూ అలవాటుగా చేసే కొన్ని పనులు మన మెదడు ఆరోగ్యాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొదటిగా చెప్పుకోవాల్సింది నిద్రపై నిర్లక్ష్యం. రోజూ సరిపడా నిద్రపోకపోతే మెదడు తన పనితీరులో బలహీనత చూపిస్తుంది. దీని ప్రభావంగా ఆలోచన చేసే శక్తి తగ్గిపోవచ్చు. జ్ఞాపకశక్తిలో లోపాలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. మనం చదివిన విషయాలు సరిగా గుర్తుండకపోవడం.. ఏ పనినైనా ఒత్తిడితో చేయడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఇంకొక హానికరమైన అలవాటు అంటే ఉదయం వేళకు అల్పాహారం తినకపోవడం. ఉదయం భోజనం వదిలేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి. గ్లూకోజ్ అంటే మెదడు పనిచేసేందుకు అవసరమైన ఇంధనం. ఇది తక్కువగా ఉన్నప్పుడు మెదడు చురుకుదనం కోల్పోతుంది. దీని ప్రభావం రోజంతా మన పనితీరుపై ఉంటుంది.

మరొక విషయం.. అధికంగా చక్కెరలతో ఉన్న ఆహారాలు తీసుకోవడం. ఇవి తినడం వల్ల మెదడులో రసాయన మార్పులు జరుగుతాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి, శ్రద్ధ సామర్థ్యం తగ్గిపోవచ్చు. దీర్ఘకాలంగా ఇలా సాగితే న్యూరోడీజెనరేటివ్ (మెదడు క్షీణత) సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఒత్తిడిని పూర్తిగా నివారించడం సాధ్యం కానప్పటికీ, దానిని అదుపు చేయకపోతే శరీరం అధిక మొత్తంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మెదడులో హిప్పోకాంపస్ అనే ముఖ్యమైన భాగంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. హిప్పోకాంపస్ అనేది జ్ఞాపకశక్తికి, నేర్చుకునే సామర్థ్యానికి కేంద్రంగా పనిచేస్తుంది. దీన్ని ప్రభావితం చేయడం ద్వారా మన మెదడును క్రమంగా బలహీనంగా మారుస్తుంది.

ఇక చివరగా శారీరక చురుకుదనాన్ని కోల్పోవడం కూడా మెదడుకు ప్రమాదకరం. రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించకపోతే మెదడులో రక్తప్రసరణ తక్కువగా జరుగుతుంది. ఈ ప్రభావం మెదడు పనితీరును తగ్గించి ఆల్జీమర్స్ లాంటి జ్ఞాపక సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఉదయం వేళ సరైన సమయానికి అల్పాహారం తీసుకోవాలి, చక్కెర వినియోగాన్ని తగ్గించాలి, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ నియమాలు పాటిస్తే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.