గంటల తరబడి కూర్చుంటున్నారా? ఆ అలవాటు మిమ్మల్ని క్యాన్సర్ వైపు నడిపిస్తుందని తెలుసా
ఆఫీసులో గంటల తరబడి డెస్క్ ముందే కూర్చుని పని చేయడం, ఇంటికి రాగానే సోఫాలో వాలిపోయి ఫోన్ స్క్రోల్ చేయడం, టీవీ చూడటం, కబుర్లు చెప్పడం.. ఇవి మన దైనందిన జీవితంలో సర్వసాధారణం అయిపోయాయి. ఈ అలవాటు చాలా మామూలుగా అనిపించవచ్చు.

కానీ, మనకు తెలియకుండానే ఇది శరీరాన్ని లోపల నుంచి నిశ్శబ్దంగా దెబ్బతీస్తోంది. కదలిక లేని ఈ నిశ్చల జీవనశైలి వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పొంచి ఉందని ముంబై, పుణెకు చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆధునిక సౌకర్యాలు మన జీవితాన్ని సులభతరం చేశాయి కానీ, అదే సమయంలో మన ఆరోగ్యాన్ని అదృశ్య ముప్పులోకి నెట్టేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ చికిత్సలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చినా, మన అలవాట్లు మారకపోవడం పెద్ద శాపంగా మారింది. కేవలం పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల మాత్రమే క్యాన్సర్ వస్తుందని అనుకుంటే పొరపాటే. మీరు రోజులో ఎక్కువ సమయం కదలకుండా ఒకే చోట కూర్చుంటున్నారా? అయితే ఆ అదృశ్య శత్రువు మీ శరీరంలో తిష్టవేసే అవకాశం ఉంది. దీనివల్ల కలిగే అనర్థాల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
అదృశ్య ముప్పు..
నేటి కాలంలో మన వృత్తిపరమైన, వ్యక్తిగత పనులన్నీ స్క్రీన్‌ల ముందే సాగుతున్నాయి. నడక తగ్గడం, ప్రతి చిన్న పనికి వాహనాలపై ఆధారపడటం వల్ల రొమ్ము, పేగు, గర్భాశయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒక గంట వ్యాయామం చేయడం వల్ల రోజంతా కూర్చున్నప్పుడు జరిగే నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో కదలిక లేనప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇన్సులిన్ నిరోధకత పెరగడం వల్ల కణాలు అసాధారణంగా వృద్ధి చెందుతాయి. కండరాలు కదిలినప్పుడు విడుదలయ్యే ‘మయోకైన్స్’ అనే రక్షణ కవచాలు కదలిక లేకపోవడం వల్ల తగ్గిపోతాయి. దీనివల్ల శరీరం దీర్ఘకాలిక వాపుకు గురై క్యాన్సర్ కారకంగా మారుతుంది.
క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి జిమ్‌లో గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
- ప్రతి అర గంటకు ఒకసారి కనీసం రెండు నిమిషాలు నిలబడటం లేదా నడవడం అలవాటు చేసుకోవాలి.
- ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒకే చోట కూర్చోకుండా అటు ఇటు నడవండి.
- తిన్న వెంటనే కూర్చోకుండా కనీసం 10 నిమిషాల పాటు చిన్న నడక సాగించండి.
- లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం ద్వారా కండరాలను చురుగ్గా ఉంచవచ్చు.
వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామంతో పాటు, రోజంతా కదలకుండా ఉండకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం. మీ శరీరంలో కదలిక ఎంత ఎక్కువగా ఉంటే, క్యాన్సర్ ముప్పు అంత తక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.
