స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యారని బాధపడుతున్నారా? చిన్న క్యూబ్‌తో స్క్రీన్ టైమ్‌కు బ్రేక్ వేసేయచ్చు
నేటి కాలంలో ఈవెంట్ ఏదైనా, ప్రదేశం ఏదైనా.. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి కనిపిస్తున్నారు. ఇల్లు, బాత్‌రూమ్, బెడ్‌రూమ్, చివరికి నడుస్తున్న రోడ్డు మీద కూడా ఫోన్ చూడటం ఒక వ్యసనంగా మారింది. చూస్తూ చూస్తూనే ప్రజలు ఈ డిజిటల్ ప్రపంచానికి బానిస అయిపోతున్నారు.

స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని అందరికీ ఉంటుంది కానీ, ఒక చిన్న నోటిఫికేషన్ రాగానే చెయ్యి ఆటోమేటిక్‌గా ఫోన్ వైపు వెళ్ళిపోతుంది. ఈ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడటానికి ఇప్పుడు మార్కెట్లోకి ఒక వింత పరికరం వచ్చింది. అదే ‘బ్రిక్’. ముఖ్యంగా 20 నుండి 35 ఏళ్ల యువతలో ఈ చిన్న పరికరం ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది.
ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం గడవదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి పనికి ఫోన్ మీద ఆధారపడుతున్నాం. ఇది క్రమంగా మనల్ని సామాజికంగా ఒంటరిని చేస్తోంది. ఈ డిజిటల్ బానిసత్వం నుండి బయటపడాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు కానీ, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లేదా వాట్సాప్ మెసేజ్‌లు వారిని అస్సలు వదలవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న గ్రే కలర్ క్యూబ్ ఇప్పుడు రక్షకుడిగా మారింది. ఎయిర్‌పాడ్స్ కేస్ పరిమాణంలో ఉండే ఈ చిన్న పరికరం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకుందాం..
అసలేంటి ఈ ‘బ్రిక్’..
బ్రిక్ అనేది ఒక చిన్న ఫిజికల్ డివైస్. ఇది మీ స్మార్ట్ ఫోన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. దీని ధర సుమారు రూ. 5,000. ఇది చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉన్నా, పనితీరులో మాత్రం చాలా పవర్‌ఫుల్. ఈ పరికరం మీ ఫోన్ స్క్రీన్ టైమ్‌ను రోజుకు సగటున 3 గంటల వరకు తగ్గిస్తుందని తయారీ కంపెనీ ధీమాగా చెబుతోంది. కేవలం ఒక చిన్న ట్యాప్ తో మీ ఫోన్ లోని అనవసరమైన యాప్స్ అన్నింటినీ ఇది బ్లాక్ చేస్తుంది. ఈ పరికరాన్ని మీ ఇంట్లో ఒక ప్రదేశంలో పెట్టుకోవాలి. మీరు పని మీద దృష్టి పెట్టాలని అనుకున్నప్పుడు లేదా ఫోన్ వాడకూడదని నిర్ణయించుకున్నప్పుడు, మీ ఫోన్ ను ఈ ‘బ్రిక్’ కు టచ్ చేయాలి.
- మీరు ఒకసారి ఫోన్ ను బ్రిక్ కు టచ్ చేయగానే, మీ ఫోన్ లోని సోషల్ మీడియా యాప్స్, గేమ్స్ వంటివి అన్నీ లాక్ అయిపోతాయి.
- మీరు తిరిగి ఆ యాప్స్ వాడాలంటే మళ్ళీ వచ్చి ఆ ఫిజికల్ బ్రిక్ ను ఫోన్ కు టచ్ చేయాల్సిందే. అంటే మీరు ఫోన్ కు దూరంగా ఎక్కడో ఒకచోట ఈ బ్రిక్ ను పెడితే, మీరు లేచి వెళ్లి దాన్ని టచ్ చేసే వరకు మీ ఫోన్ లోని వ్యసనకారక యాప్స్ ఓపెన్ కావు.
- కాల్స్, మెసేజ్‌లు వంటి ముఖ్యమైన ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉంటాయి. కేవలం మనల్ని బానిసలుగా మార్చే యాప్స్ ను మాత్రమే ఇది అడ్డుకుంటుంది.
ప్రస్తుత యువతలో ‘డిజిటల్ డెటాక్స్’ పట్ల ఆసక్తి పెరిగింది. ఫోన్ సెట్టింగ్స్ లో ఉండే ‘స్క్రీన్ టైమ్’ లిమిట్స్ ను మనం సులభంగా బైపాస్ చేయవచ్చు కానీ, ఫిజికల్ గా ఒక పరికరం ద్వారా లాక్ చేయడం వల్ల మానసికంగా ఒక క్రమశిక్షణ వస్తుందని వినియోగదారులు భావిస్తున్నారు. అందుకే 20-35 ఏళ్ల మధ్య ఉన్న వారు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. టెక్నాలజీ వల్ల వచ్చిన సమస్యకు టెక్నాలజీ తోనే పరిష్కారం వెతకడం వింతగా అనిపించినా, బ్రిక్ వంటి పరికరాలు మనల్ని వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడానికి సహాయపడుతున్నాయి.
