High Cholesterol: కాస్త వేగంగా నడిస్తే చాలు కాళ్లు నొప్పిగా ఉంటున్నాయా? పెను ప్రమాదానికి ఇదొక సంకేతం
కొలెస్ట్రాల్ వయస్సుతో మాత్రమే పెరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నేటి కాలంలో 30 ఏళ్లు నిండని యువత రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. నియంత్రణ లేని జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు. ఎక్కువ కాలం కొలెస్ట్రాల్‌తో బాధపడటం కూడా గుండె జబ్బులకు దారి తీస్తుంది. మైనం లాంటి పదార్ధం ధమనులలో పేరుకుపోతే, శరీరంలో రక్త ప్రసరణకు..
కొలెస్ట్రాల్ వయస్సుతో మాత్రమే పెరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే నేటి కాలంలో 30 ఏళ్లు నిండని యువత రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. నియంత్రణ లేని జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు. ఎక్కువ కాలం కొలెస్ట్రాల్‌తో బాధపడటం కూడా గుండె జబ్బులకు దారి తీస్తుంది. మైనం లాంటి పదార్ధం ధమనులలో పేరుకుపోతే, శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఆపై శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండకపోతే కొలెస్ట్రాల్ పెరగడాన్ని నియంత్రించడం చాలా కష్టం అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చాలా సందర్భాలలో అధిక కొలెస్ట్రాల్ సకాలంలో నిర్ధారణ చేయలేం. తరచూ రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల దీనిని సకాలంలో గుర్తించవచ్చు. లేదంటే కొన్ని లక్షణాలను బట్టి కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఫ్యాటీ లివర్ సమస్యలు ఉండవు. చాలా మంది హఠాత్తుగా బరువు పెరుగుతుంటారు. అయితే దీని వెనుక వేరే కారణాలు కూడా ఉండవచ్చు. ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే వాకింగ్ లేదా వ్యాయామం చేసేటప్పుడు కొన్ని లక్షణాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒంట్లో అధిక కొలెస్ట్రాల్ ఉంటే కొంచెం గట్టిగా నడిచినా పాదాల నొప్పులు మొదలవుతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే లక్షణాలలో ఇది ఒకటి.
శరీరంలోని వివిధ భాగాలకు రక్త ప్రసరణ ధమనుల ద్వారా జరుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే, ధమనుల్లో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. దీనినే ‘అథెరోస్క్లెరోసిస్’ అంటారు. దీంతో శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ధమనుల్లోని రక్త నాళాల్లో ఫలకం ఏర్పడుతుంది. ఈ ఫలకం ఏర్పడినప్పుడు శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరిగ్గా ప్రవహించదు. ముఖ్యంగా శరీరం దిగువ భాగంలో రక్త ప్రసరణ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ పరిస్థితిని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) అంటారు. చాలా సందర్భాలలో ఈ సమస్య కాళ్ళలో అధికంగా కనిపిస్తుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు కాళ్లలో రక్త ప్రసరణ సవ్యంగా జరగదు. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గుతుంది. అంతేకాకుండా పాదాలు మొద్దుబారడం, పాదాల చర్మం రంగు మారడం, గోళ్ల ఎదుగుదల తగ్గడం, పాదాలు, చీలమండల్లో రకరకాల సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి కొంచెం వేగంగా నడిచినా కాలు నొప్పిగా ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ లక్షణాలు ఏవైనా ఉంటే, వెంటనే కొలెస్ట్రాల్ తనిఖీ చేసుకుని వైద్యుడిని సంప్రదించడం మంచిది.